విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో తెలియందికాదు. రిజల్ట్ డే రోజు టెన్షన్ పడుతుంటారు. తీరా ఫలితాలు చూశాక హమ్మయ్యా అనుకోవడమో.. ఆశించిన మార్కులు రాలేవని ఉసూరుమనడమో.. ఫెయిల్ అయ్యామని తలబాదుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు. కానీ, 16 ఏళ్ల అన్షుల్ కుమార్ ఇందుకు భిన్నం. రిజల్ట్ చూసి నమ్మలేకపోయాడు. ఫలితాలు చూసిన వెంటనే మూర్ఛపోయాడు. కుప్పకూలిపోయాడు. అలాగని ఆయన ఫెయిల్ కాలేదండీ! పదో తరగతి పరీక్షల్లో 93.5 శాతం మార్కులు సంపాదించుకున్నాడు.
మీరట్‌కు చెందిన అన్షుల్ కుమార్ మోదిపురంలోని మహారిషి దయానంద్ ఇంటర్ కాలేజీలో చదువుతున్నాడు. యూపీ బోర్డు పదో తరగతి పరీక్షలు రాశాడు. ఫలితాల కోసం ఎదురుచూశాడు. రిజల్ట్ విడుదల కాగానే ఆసక్తిగా చూశాడు. ఆయనకు పదో తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. ఈ ఫలితం చూడగానే అన్షుల్ కుమార్ దిమ్మదిరిగి పడిపోయాడు. ఆయన కిందపడిపోవడం చూసిన కుటుంబం ఆందోళన చెందింది. ఆయనను మళ్లీ మెలకువలోకి తేవడానికి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వైద్యులు ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిసింది.
Also Read: Delhi Liquor Case: వచ్చే నెలలో తేలనున్న ఎమ్మెల్సీ కవిత భవితవ్యం
అన్షుల్ కుమార్ తండ్రి సునీల్ కుమార్ పోస్ట్ ఆఫీసులో కాంట్రాక్ట్ వర్కర్. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం స్థిమితంగా ఉన్నదని బంధువు పుశ్పేంద్ర తెలిపారు. రిజల్ట్ చూసి ఆ బాలుడు వెంటనే కుప్పకూలిపోవడం కారణంగా శుభ తరుణంలోనూ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైందని వివరించారు.
తన రిజల్ట్ చూసుకుని బాలుడు మూర్ఛపోవడం ఏమిటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు అన్ని మార్కులు వస్తాయని ఆ అబ్బాయే ఎక్స్‌పెక్ట్ చేయలేదా? అని చర్చిస్తున్నారు. రిజల్ట్ చూసుకుని అబ్బే నమ్మశక్యంగా లేదే అని బాలుడు ఫీల్ అయ్యాడేమో అని కామెంట్లు పెడుతున్నారు.