తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Revanth Reddy – Rahul Gandhi: రాహుల్‌గాంధీ లేకపోతే మనం ఎస్సీ వర్గీకరణ చేసుకునేవారిమే కాదని, ఆయన ఆలోచన, పట్టుదలతోనే దేశంలోనే మొదట అమలులోకి తెచ్చామని గుర్తుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. తొలుత కృతజ్ఞతలు, అభినందనలు చెప్పాల్సింది ఆయనకేనని అన్నారు. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించినందుకు దళిత ఎమ్మెల్యేలు, సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
నిజానికి వర్గీకరణ కోసం ఆనాడు అసెంబ్లీలో తాను గొంతెత్తానని, తీర్మానం చేయాలని డిమాండ్ చేశానని, కానీ అప్పటి ప్రభుత్వం తనను సభ నుంచి సస్పెండ్ చేసిందని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ కల సాకారమయ్యేందుకు బిల్లును తెచ్చి, అన్ని పార్టీల ఆమోదంతో చట్టం చేసుకోగలిగామన్నారు. రాహుల్‌గాంధీ లేకుంటే తనకు ఇంతటి శక్తి వచ్చేది కాదన్నారు. ఈ చట్టానికి భవిష్యత్తులో లీగల్ చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, అది ఇచ్చిన 199 పేజీల నివేదికను ఆమోదించి ఇప్పుడు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించుకున్నామన్నారు.
Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టేసిన హైకోర్టు
ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, వర్గీకరణ చట్టం ఎవ్వరికీ వ్యతిరేకంగా చేసింది కాదని సీఎం వ్యాఖ్యానించారు. వర్గీకరణ ద్వారా ఎస్సీలకు న్యాయం చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు దీనికి కదలిక లేదని, ఇప్పుడు ఏడాది కాలంలోనే మనం అమల్లోకి తెచ్చుకోగలిగామన్నారు. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన గంటలోనే ఇదే సభలో తీర్మానం చేసుకున్నామని, ఎనిమిది నెలల వ్యవధిలో చట్టం చేసుకున్నామని గుర్తుచేశారు.
ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ చట్టం రాలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లేదని, తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. సుప్రీంకోర్టులో వాదనలను బలంగా, శాస్త్రీయంగా వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు కృషి చేశామని గుర్తుచేశారు. న్యాయపరమైన హక్కుల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్న చిత్తశుద్ధే ఇప్పుడు చట్టానికి నాంది పలికిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్లలో ఎప్పుడూ వైస్ ఛాన్స్‌లర్ మాదిగ కులానికి చెందినవారు లేరని, కానీ ఫస్ట్ టైమ్ మనం నియమించామన్నారు.
Also read: CM Revanth Reddy: ఆ ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న సీఎం.. వెయిట్ అంటూ సూచన
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ ఖాసీంను, ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్‌లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఇది ఒక గొప్ప అవకాశమని, పది మందికి ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మీపైనా ఉన్నదని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “ముఖ్యమంత్రి సీట్లో మీ వాడిగా నేనున్నా… మీకు మంచి చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు… ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో పనిచేయండి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి…” అని సీఎం నొక్కిచెప్పారు.