CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020 మార్చిలో నార్సింగి పోలీసు స్టేషన్ లో ఆయనపై నమోదైన కేసును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డి, మరికొంత మందిపై అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి 2020 మార్చిలోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు సైతం తరలించారు. అయితే ఈ అరెస్టును సవాలు చేస్తూ రేవంత్.. 2020 మార్చిలో FIR క్వాష్ చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమి కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అతడి వాదనతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయానిదే విజయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
18 రోజులు జైలు జీవితం
జన్వాడలోని ఫాంహౌస్ కేసు (Janwad Farmhouse Drone Case) అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. నాడు మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ (KTR)కు సంబంధించిన ఆ ఫాంహౌస్ మీద అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారంటూ రేవంత్ రెడ్డిపై అప్పటి ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది. ఆపై వెంటనే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు (Revanth Reddy Arrest) కూడా చేశారు. దీంతో 18 రోజుల పాటు రేవంత్ జైలులో గడపాల్సి వచ్చింది.
డ్రోన్ కథ ఏంటంటే
భూ యజమానిని బెదిరించి 25 ఎకరాలను కేటీఆర్ కొనుగోలు చేశారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 నిబంధనలను విస్మరించి జన్వాడ ఫాంహోస్ ను సైతం నిర్మిండంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే విలాసవంతమైన ఫాంహోస్ కు సంబంధించి డ్రోన్ తో తీసిన ఫొటోలను రేవంత్ గతంలో మీడియాకు రిలీజ్ చేశారు. ప్రైవేటు ఆస్తిపై చట్టవిరుద్ధంగా డ్రోన్ ఎగరవేశారంటూ ఎయిర్ క్రాఫ్ట్ చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 నాటి ఈ కేసును కొట్టివేయాలని తాజాగా హైకోర్టు ఆదేశించడం గమనార్హం.
Also Read: United Forum of Bank Unions: బ్యాంకుల్లో సమ్మె సైరన్.. వరుసగా 4 రోజులు సెలవు
కేటీఆర్ కేసూ కొట్టివేత
సీఎం రేవంత్ రెడ్డితో పాటు విపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ కు సైతం హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సైఫాబాద్ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసును ధర్మాసనం కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చిగొట్టేలా మాట్లాడారంటూ కేటీఆర్ పై ఎంపీ అనిల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. రాజకీయ కక్షలతోనే కేటీఆర్ పై కేసు పెట్టారని అతడి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆ వాదనలు విన్న హైకోర్టు ధర్మసనం కేటీఆర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.