CM Revanth Reddy: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వయంగా రంగంలోకి దిగి, ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పట్టణ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రచార షెడ్యూల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వంపై ‘రెఫరెండం’గా భావిస్తున్న ముఖ్యమంత్రి, పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు స్వయంగా పర్యటిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం : సీఎం రేవంత్ రెడ్డి!
ప్రత్యర్థులకు గట్టి సవాల్
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన రోజే (ఫిబ్రవరి 3) ప్రచారం ప్రారంభించడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరేలా ప్లాన్ చేశారు.సీఎం పర్యటనలతో తమకు కలిసివస్తుందని చాలా మంది కాంగ్రెస్ అభ్యర్ధులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్ల కాల వ్యవధిలో అమలు చేసిన ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ ,పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన నిధులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యంగా మధ్యతరగతి మరియు పట్టణ ఓటర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ, పట్టణాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈసారి ఆ లోటును భర్తీ చేసేందుకు జగిత్యాల, నిజామాబాద్ వంటి కీలక పట్టణాల్లో భారీ బహిరంగ సభలను ప్లాన్ చేశారు.
ఫిబ్రవరి 11న పోలింగ్
ఇదిలా ఉండగా, ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే టీపీసీసీ ‘వార్ రూమ్’ను యాక్టివేట్ చేసింది. గుత్తా అమిత్ రెడ్డిని వార్ రూమ్ చైర్మన్‌గా నియమించి, క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్‌ఛార్జ్ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేను బాధ్యులుగా నియమించి, స్థానిక నేతల మధ్య ఉన్న అసమ్మతిని చక్కదిద్దుతున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
సీఎం షెడ్యూల్ ఇలా..
తేదీ జిల్లా ప్రాంతం
ఫిబ్రవరి 3 నల్లగొండ మిర్యాలగూడ
ఫిబ్రవరి 4 కరీంనగర్ జగిత్యాల
ఫిబ్రవరి 5 రంగారెడ్డి చేవెళ్ల
ఫిబ్రవరి 6 జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి
ఫిబ్రవరి 7 మెదక్ మెదక్ టౌన్
ఫిబ్రవరి 8 నిజామాబాద్ నిజామాబాద్

