Cabinet Expansion: పీసీసీ కార్యవర్గం ఎంపికకు మళ్లీ బ్రేక్ పడింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఈనెల 30న మరోసారి రివ్యూ నిర్వహించనున్నారు. ఆ రోజు మళ్లీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులకు ఏఐసీసీ సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారమే ఎంపిక కావాల్సిన లిస్టు మళ్లీ డీలే అయింది. ఇక జూన్ మొదటి వారంలోపే పార్టీ కార్యవర్గం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ సీరియస్‌గా స్టడీ చేస్తున్నది. క్యాస్ట్, పొలిటికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేస్తూ లిస్టు తయారు చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే సూచించారు.
అయితే పీసీసీ కార్యవర్గం కోసం తొలుత వందకు పైగా మెంబర్లతో లిస్టును తయారు చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన తర్వాత లిస్టు సైజును సుమారు వంద మందికి తగ్గించారు. కేసీతో భేటీ అనంతరం 30 శాతం పేర్లను తగ్గించాల్సిందేనని సీఎం, పీసీసీ చీఫ్‌కు సూచించారు. దీంతో ఆ లిస్టును దాదాపు 70 నుంచి 75 మందికి తగ్గించి తయారు చేశారు. అనంతరం సోమవారం కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, పీసీసీ చీఫ్మరోసారి భేటీ అయ్యారు. అయితే మల్లికార్జున ఖర్గే పరిశీలించిన తర్వాత ఫైనల్ చేద్దామని కేసీ పేర్కొన్నారు. దీంతో కార్యవర్గం ఎంపిక వాయిదా పడింది.
నో క్లారిటీ..?
పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే సీఎం, పీసీసీ చీఫ్‌లు గడిచిన రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయ్యారు. కానీ లిస్టు ఫైనల్‌పై క్లారిటీ రాలేదు. మళ్లీ ఈ నెలాఖారుకు పెండింగ్ పడింది. దీంతో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని పీసీసీ చీఫ్తన ఫ్యామిలీతో మర్యాదపూర్వకంగా కలిశారు. వీలైనంత త్వరగా కార్యవర్గం, క్యాబినెట్ విస్తరణ చేయాలని కోరారు. ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత ఫైనల్ చేద్దామని ఆయన కూడా పీసీసీ చీఫ్‌కు వివరించినట్లు తెలిసింది. ప్రతీసారి ఎంపిక ప్రాసెస్ డీలే అవుతున్న నేపథ్యంలో ఆశావహులు నారాజ్ అవుతున్నారు. అసలు పార్టీ కార్యవర్గం ఎంపిక చేస్తారా? లేదా? అనే అనుమానం కూడా నెలకొన్నది. మరోవైపు 30 తేదిన కూడా ఫైనల్ చేస్తారనే నమ్మకం కూడా లేదని ఓ నేత చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రాసెస్‌లు డీలే అయితే ఎట్లా? అని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Rerad: Kandula Durgesh: సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించం!
క్యాబినెట్ కూడా స్లో..!
క్యాబినెట్ విస్తరణ ప్రాసెస్ కూడా వెరీ స్లోగా ఉన్నది. క్యాస్ట్, పొలిటికల్ ఈక్వేషన్స్ సెట్ కాకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. కేసీ వేణుగోపాల్‌తో కేవలం కార్యవర్గం ఎంపిక మీదనే చర్చించిన సీఎం, పీసీసీ చీఫ్‌లు, ఈ నెల 30న క్యాబినెట్ విస్తరణపై ఖర్గేతో డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. ఏడాది నుంచి క్యాబినెట్ విస్తరణ పెడింగ్ పడుతూనే ఉన్నది. ఏఐసీసీ నుంచి జాబితా రానున్నదని పలుమార్లు స్వయంగా సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులూ వెల్లడించారు. కానీ ఆ గడువు సాగుతూనే ఉన్నది. ప్రస్తుత క్యాబినెట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రతినిధ్యం లేదు. పైగా బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో క్యాబినేట్ విస్తరణలో ఆయా జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే, సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు పార్టీ గతంలో ప్రకటించింది.
రేసులో కీలక ఎమ్మెల్యేలు!
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెర్త్‌లకు ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది. క్యాబినెట్‌లో స్థానం కోసం ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్‌లో తమకు కలిసి వస్తుందనే ఆశతో ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, ఆది శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు బాలు నాయక్, వీర్లపల్లి శంకర్‌లు కూడా ఉన్నారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రులుండగా, ఆరు ఖాళీగా ఉన్నాయి. ఆరు ఖాళీల్లో ఐదు స్థానాలను భర్తీ చేయాల్సిందేనని కేసీ తన అభిప్రాయాన్ని సీఎం, పీసీసీ చీఫ్‌లతో షేర్ చేసుకున్నారు. అయితే ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీల ప్రకారమే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Swetcha Investigation: ఈ అక్రమార్కుడు.. చట్టానికి అతీతుడా?