KTR: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ(Rahul Gandhi) అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(JTR) మండిపడ్డారు. జాతీయ స్థాయిలో “ఓటు చోరీ” గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న “ఎమ్మెల్యేల చోరీ” గురించి మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ మాట్లాడాలన్నారు. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్
ఇంత బహిరంగంగా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో కాంగ్రెస్(Congress) పార్టీ భాగస్వామ్యాన్ని చూసి రాహుల్ గాంధీ సిగ్గుపడాలన్నారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిసి, వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గుర్తు చేశారు. “ఇవ్వాళ వీళ్ళను మీరు గుర్తుపట్టగలరా?” అంటూ ఆ ఫోటోలను చూపిస్తూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు “మేము కాంగ్రెస్‌లో చేరలేదు” అని చెప్పడంపై మండిపడ్డారు. అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు.. మీరు దీన్ని ఒప్పుకుంటారా? అని రాహుల్ గాంధీని నిలదీశారు. ‘ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?’ అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై రాహుల్ గాంధీకి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ
పోలీస్ కేసులు పెడతారా?
రైతుల కష్టాలు చూపిస్తే పోలీస్ కేసులు పెడతారా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను చూపించినందుకు ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ పై అక్రమ కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది రైతుల సమస్యలను పరిష్కరించే సమయం, జర్నలిస్టులను వేధించే సమయం కాదు అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, వాటిని బయటపెట్టినందుకు జర్నలిస్టులను, మీడియాను బెదిరించడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి, ఇందిరమ్మ పోలీస్ రాజ్యానికి నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యం.. దాన్ని అణిచివేయడానికి పోలీసులను వాడడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం తక్షణమే సాంబశివరావుపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరంకుశ పాలనను ప్రజల్లో మరింత ఎండగడతామన్నారు.
Also Read: Little Hearts: బన్నీ నుంచి చైతూ వరకూ.. ‘లిటిల్ హార్ట్స్’ అందులోనూ టాప్ ప్లేసే!