BRS Party: బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఒక్కో గ్రామంలో ముగ్గురు నలుగురు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమకు తెలిసిన నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు సమాచారం. జనరల్ స్థానాల నుంచి ఇంకా ఎక్కువ మంది పోటీపడుతున్నట్లు నేతలే పేర్కొంటున్నారు. అయితే, ఎవరికి ఇవ్వాలనేది మాత్రం స్థానిక ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే నిర్ణయిస్తారనేది సమాచారం. వారు ఫైనల్ చేసిన తర్వాత జిల్లా పార్టీకి, అక్కడి నుంచి రాష్ట్ర పార్టీకి పంపిస్తారని సమాచారం.
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
గులాబీ పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టిసారించింది. క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలంటే సర్పంచ్ ఎన్నికలు కీలకమని భావిస్తుంది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తే తమకు గ్రామాల్లో పట్టుదొరుకుతుందని, రాబోయే ఏ ఎన్నికలు అయినా సునాయసంగా విజయం సాధించవచ్చని భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను పార్టీ ఆదేశాలు సైతంజారీ చేసింది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా క్లీన్‌స్విప్ చేశామో అదే స్థాయిలో చేయాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పార్టీ నేతలంతా దృష్టిసారించాలని, పార్టీ నేతలను, కేడర్‌ను సన్నద్ధం చేయాలని సూచించింది.
ఆర్థికంగా బలంగా ఉన్నవారికే టికెట్ !
గ్రామాల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్నవారు పార్టీ గ్రామ శాఖకు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు సన్నద్ధమవుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తున్నారు. ఒక్కో గ్రామంలో ముగ్గురు నుంచి నలుగురు పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని గ్రామ కమిటీ అధ్యక్షులకు తెలియజేస్తున్నారు. అందులో ఎవరి బెటర్.. ఎవరిని బరిలో నిలిపితే విజయం సాధిస్తామని గ్రామ కమిటీ సమావేశాల్లో చర్చిస్తున్నట్లు సమాచారం. గ్రామ శాఖ అధ్యక్షుడి ఇంట్లోనే భేటీ అవుతూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని భావనకు వచ్చినట్లు సమాచారం. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగకున్నా పార్టీ నేతలే పోటీ చేస్తుంటారు. దీంతో పార్టీలు ఆయా వ్యక్తికి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికనే గ్రామ శాఖలు మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే అనుమతితో ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!
పోటీకి ఆసక్తి
జనరల్ స్థానాల్లో ఓసీ, బీసీ ఇతర కులాలకు చెందినవారు సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఉందని సమాచారం. దీంతో పార్టీ సీనియర్ నేతలు జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం వహిస్తూ సర్పంచ్
గా పోటీచేసే అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. అవసరం అయితే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారికి గెలిస్తే గ్రామాల్లో చేపట్ట బోయే పనుల హామీలతో పాటు డబ్బును కూడా మొట్టచెప్పుతామని పేర్కొంటున్నట్లు సమాచారం. ఎక్కువ మంది బరిలో ఉంటే నష్టమని అభిప్రాయానికి వచ్చి ఈ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలో లేకపోయినా.. పూర్తిస్థాయిలో పార్టీ గ్రామ కమిటీలు లేకపోయినప్పటికీ గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీకి ఎక్కువమంది ఆసక్తి చూపుతుండటం గమనార్హం.
అస్త్రంగా చేసుకొని లబ్దిపొందాలని
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించి సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఇప్పటికే నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ రెండేళ్లలో వైఫల్యం చెందిందని, ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్, ఎస్సీ, ఉద్యోగ కాలెండర్, ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో వైఫల్యం చెందిందనే అంశాన్ని గడగడపకు వివరించాలని భావిస్తుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లలో మోసం చేసిందని, ఈ అంశాన్ని సర్పంచ్ ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకొని లబ్దిపొందాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Also Read: BRS Party: నేతల పనితీరుకు పంచాయతీ ఎన్నికలే కీలకం.. వ్యూహం ఫలించేనా..?
