Harish Rao: బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)పై ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పార్టీలో కేసీఆర్‌కు హరీశ్ రావే ప్రత్యామ్నాయం అని ఓ వర్గం బలంగా వాదిస్తున్నది. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన పార్టీని నడపలేరని బీఆర్ఎస్‌లోని సీనియర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.
కేటీఆర్ ఆధ్వర్యంలో వరుస ఓటములు
కేటీఆర్ నాయకత్వంలో ఇటీవల బీఆర్ఎస్ ప్రతి ఎన్నికలో ఓడిపోయిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని వివరిస్తున్నారు. ఇక, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోని మెజారిటీ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ సత్తా చాటిందని ఉదహరిస్తున్నారు. కేటీఆర్‌కు పార్టీని నడిపే సత్తా లేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని హరీశ్ రావు వర్గం వాదిస్తున్నది. సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కేటీఆర్ గెలిపించుకోలేకపోయారని, ఇక ఆయన ఆధ్వర్యంలో పార్టీ నడవడం కష్టమని సీనియర్లు గుసగుసలాడుతున్నారు. కేటీఆర్ మాత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో 80 శాతం గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నదని అంటున్నారు.
Also Read: Harish Rao: సిద్దిపేటలో ఫలించిన హరీష్ రావు వ్యూహం.. ఎక్కువ స్థానాల్లో గెలుపు!
హరీశ్ రావుతో సీనియర్ల భేటీ?
మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా సిద్దిపేటలో హరీశ్ రావు మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 300 పైచిలుకు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోగలిగారని గుర్తు చేస్తున్నారు. ఇదే ఆయన బలమైన నాయకత్వానికి నిదర్శనమని ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో అసమ్మతి పెరుగుతున్న వేళ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పేలవ ప్రదర్శనతో కేటీఆర్ నాయకత్వంపై నేతలు పెదవి విరుస్తున్నారు. ఆయనపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు, హరీశ్ రావుతో ఇటీవల రహస్యంగా భేటీ అయినట్టు చర్చ జరుగుతున్నది. పార్టీ పగ్గాలను చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని, సొంత నియోజకవర్గంలో కేటీఆర్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారని, బీఆర్ఎస్‌ను ముందుండి నడపాలని వారందరూ హరీశ్ రావును కోరారని సమాచారం.
ఇక హ్యాండ్సప్ చేయాల్సిందేనా?
బీఆర్ఎస్ పగ్గాలను కేసీఆర్ నుంచి చేజిక్కించుకొనే విషయమై సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో హరీశ్ రావు కూడా ఆలోచనలో పడినట్టు సమాచారం. కేటీఆర్ గనుక పార్టీని నడిపితే అందరం మునుగుతామనే భావనలో సీనియర్లు ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో పార్టీ కనుమరుగైనదని, కేటీఆర్‌ను గనుక కొనసాగిస్తే ఇక కొంతమేర బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ హ్యాండ్సప్ చేయాల్సి ఉంటుందని సీనియర్లు హరీశ్ రావు వద్ద మొర పెట్టుకున్నట్టు సమాచారం.
ఆ ప్రకటన వెనుకు వ్యూహం ఏంటి?
ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ల ఒత్తిడి మేరకు పార్టీపై పట్టుకోసం హరీశ్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ కార్యవర్గ, ఎల్పీ సమావేశాన్ని 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆయన నుంచి ప్రకటన వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. కారణాలు ఏవైనా కూడా సహజంగా ఇలాంటి ప్రకటనలు అన్నీ తెలంగాణ భవన్ నుంచి విడుదల అయ్యేవని, అయితే హరీశ్ రావు నుంచి విడుదల కావడం బీఆర్ఎస్‌లో రాబోయే రోజుల్లో జరగబోయే కీలక రాజకీయ పరిణామాలకు నాంది పలికిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read: Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

