BRS: రాజధానికే పరిమితమై గుర్రుమంటున్న బీఆర్ఎస్ నేతలు
BRS (imagecredit:twitter)
Political News, Telangana News

BRS: రాజధానికే పరిమితమై గుర్రుమంటున్న బీఆర్ఎస్ నేతలు.. ఎందుకో తెలుసా..!

BRS: సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది అభ్యర్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. కనీసం కలుద్దామని వెళ్తే లేడనే సమాధానం వస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సీనియర్ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు, మాజీలంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గ్రామాలకు వెళ్తే ఎన్నికల ఖర్చులకు డబ్బులు అడుగుతారని, అటు పోకపోవడమే బెటర్ అని వెళ్లట్లేదు. దీంతో నేతలపై పార్టీ కేడర్‌ గుర్రుగా ఉన్నది. గ్రామాల్లో పార్టీ బలోపేతం కావాలంటే గ్రామస్థాయి ఎన్నికలు కీలకం. ఈ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగకుండా వాటి మద్దతుతోనే జరుగుతుండటంతో గ్రామాల ప్రజలు సైతం పార్టీ మద్దతు దారులనే గెలిపిస్తుంటారు. ఈ ఎన్నికలు పార్టీల బలోపేతాన్ని సూచిస్తాయి. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో అన్నిపార్టీల మద్దతు దారులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఖర్చులు సైతం చేస్తూ, గెలుపుకోసం పోటీపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేగానీ, మాజీ ప్రజాప్రతినిధి గానీ, ఇన్‌ఛార్జ్‌గానీ పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కనీసం కలుద్దామని వెళ్తే అసలు నియోజకవర్గానికే రావడం లేదని, పార్టీ కార్యాలయానికి వెళ్లినా కలువడం లేదని మండిపడుతున్నారు. పార్టీ ఏమైనా ఆర్థిక సహకారం అందిస్తుందని భావించిన అభ్యర్థులకు నిరాశే ఎదురవుతున్నది.

అసలు కారణమిదే..

వీటికి తోడు కొన్ని గ్రామాల్లో గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేస్తున్న కార్యకర్తలే సర్పంచ్‌గాను ఇద్దరికి పైగా పోటీ చేస్తున్నారు. వాటిని సమన్వయం చేసి విత్ డ్రా చేసుకోవాలని సీనియర్ నేతల నుంచి, ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి తెద్దామని భావించిన అభ్యర్థులకు సైతం ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీనికి కారణం వారు అందుబాటులో లేకపోవడమే. అంతేకాదు వారంతా హైదరాబాద్‌కే పరిమితం కావడం మరో కారణం. ఎన్నికలు లేనప్పుడు నియోజకవర్గ పర్యటనకు వచ్చే నేతలు ఇప్పుడు రావడం మానేశారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఎందుకు డబ్బులు ఖర్చుపెట్టుకోవాలి? గెలిచినా వారు పార్టీలో ఉంటారో, అధికారపార్టీలోకి మారతారో తెలియదు. అలాంటప్పుడు ఎందుకు అవసరమా? అనేది వారిలో అభిప్రాయం ఉండటంతోనే అభ్యర్థులకు సమయం ఇవ్వట్లేదని సమాచారం.

Also Read: Chenjarl Sarpanch Election: చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా.. మహిళా సర్పంచ్ అభ్యర్థి ఛాలెంజ్ ఇదే

కత్తిమీద సాములా పరిస్థితి

గ్రామాల్లోని పరిస్థితి వివరిద్దామని, నేతల సమన్వయం అంశంపైనా మాట్లాడుదామని భావించిన ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం అందుబాటులోకి రావడం లేదని సమాచారం. గ్రామ కమిటీలు సైతం పటిష్టంగా లేకపోవడం, కేవలం అభ్యర్థులు స్వశక్తితోనే ముందుకు సాగుతుండటం వారికి కత్తిమీద సాములా మారింది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని గతంలో పార్టీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు సైతం అందుబాటులో ఉండాలని గెలుపు బాధ్యతలను సైతం అప్పగించింది. కానీ, వారు ముఖం చాటేస్తుండటంతో మెజార్టీ స్థానాల్లో గెలుపు అటుంచితే, ఎలా విజయం సాధించాలనేదానిపై అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేశారు. ప్రతిపని వాళ్లే చేసుకుని, ఆర్థికంగా బలోపేతం అయ్యారు. కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కనీసం గ్రామాలకు పైసా ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ఎలా విజయం సాధిస్తారు? అని గ్రామాల్లో పార్టీ ఎలా బలోపేతం అవుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Also Read: Chamal Kiran Kumar Reddy: కిషన్ రెడ్డి దొంగ లెక్కలతో ప్రచారం చేస్తున్నారు.. ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి

Just In

01

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా