తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: KCR on Jagadish Reddy: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్‌పై ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి చేసిన కామెంట్లు బీఆర్ఎస్‌లో చర్చకు దారితీసింది. స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించిగానీ, వ్యక్తిగతంగా ఆయనపైగానీ ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదనే మాటలు వినిపిస్తున్నాయి. జగదీశ్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ అధినేత కూడా అసంతృప్తి వ్యక్తం చేసి సీరియస్ అయినట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పెట్టి ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసింది ఇదేనా… అంటూ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తనకు అంటుకున్నాయని ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు గులాబీ నేతల ద్వారా తెలిసింది. జగదీశ్‌రెడ్డిని సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం గులాబీ ఎమ్మెల్యేలను పరేషాన్‌లోకి నెట్టడమే కాకుండా ఇకపైన ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయోననే గుబులు మొదలైంది.
జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తదితరులు విమర్శలు చేయడంతో పాటు సచివాలయం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. జగదీశ్‌రెడ్డికి మద్దతుగా నిలిచినా కేసీఆర్ ఒక స్థాయిలో మందలించడంతో ఇక నుంచి ఈ వ్యవహారంపై ఓపెన్ కామెంట్లు చేయకుండా ఆచితూచి అడుగేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
Also Read: Nagam Janardhan – Chandrababu: నాగంలో ఇంత మార్పేంటి? చంద్రబాబుతో భేటీ అందుకేనా?
జగదీశ్‌రెడ్డి తీరును కేసీఆర్ ఖండించిన తర్వాత కూడా నిరసనలు జరిగితే అర్థం ఉండదనే భావనతో ఆ అంశాన్ని అక్కడితోనే వదిలేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. జగదీశ్‌రెడ్డిపై స్పీకర్ నిర్ణయం సస్పెన్షన్ వరకే ఆగిపోతుందా లేక ఎథిక్స్ కమిటీ పరిశీలన తర్వాత ఈ టర్ము మొత్తానికి ఆయనపై అనర్హత వేటు వేసే వరకు దారితీస్తుందా అనే ఆందోళనా లేకపోలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (సభా నాయకుడు కూడా) గతేడాది అసెంబ్లీ సెషన్‌లో కేటీఆర్ ఏకవచనంతో పిలవడం, ఆ చైర్‌కు మర్యాద ఇవ్వకపోవడంపైనా సభ్యుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. వెంటనే ఆ కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు సభా వేదికగానే ప్రకటించారు. కానీ ఈసారి జగదీశ్‌రెడ్డి విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆయనకు అండగా ఉన్నారు. సస్పెన్షన్ నిర్ణయం తర్వాత స్పీకర్ నిర్ణయంపై నిరసన తెలిపారు.
ఇకపైన సస్పెన్షన్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ అక్కడితో వదిలేస్తుందా?.. పొలిటికల్‌గా మల్చుకునేలా వ్యవహరిస్తుందా?… పరుష కామెంట్లు చేసి మరికొందరు కూడా సస్పెండ్ అయ్యేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందా?.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే పేరుతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందా?.. ఇలాంటి ఊహాగానాలూ ప్రస్తుతం వినిపిస్తున్నాయి.
ఈ నెల చివరి వరకూ బడ్జెట్ సెషన్ కొనసాగనున్నందున బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తదుపరి కదలికలు ఎలా ఉంటాయనే ఆసక్తికర చర్చ మొదలైంది. స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సమయంలో సభా నాయకుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం జరిగిందనే మాటలూ గురువారం వినిపించాయి. ఒకవేళ సీఎం ఉన్నట్లయితే వెంటనే ఈ అంశాన్ని తేలిపోయే ఉండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
Also Read;Warangal News: ములుగు డిఎస్పీ సీరియస్ వార్నింగ్.. ఇలా చేస్తే కటకటాలే..
కౌశిక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తనపై గత సెషన్‌లోనే స్పీకర్ సున్నితంగా హెచ్చరిక చేశారు. సభను నడిపించడంలో స్పీకర్ కఠినంగా వ్యవహరించాలని, ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదంటూ కాంగ్రెస్ సీనియర్ సభ్యులతో పాటు అక్బరుద్దీన్ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక నుంచి ఎలాంచి నిర్ణయాలు వెలువడతాయోననే చర్చ కూడా సభ్యుల్లో జరుగుతున్నది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చల్లో పాల్గొన్న సభ్యులు వెలువరించిన అభిప్రాయాలన్నింటిని క్రోడీకరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమాధానం ఇవ్వనున్న నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలను ఏ రూపంలో ప్రస్తావిస్తారు.. ఎలా రియాక్ట్ అవుతారు.. ఎలాంటి హెచ్చరిక చేయనున్నారు.. ఇలాంటివన్నీ ఆసక్తికరంగా మారనున్నాయి.
స్పీకర్‌ను దూషించడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇకపైన రిపీట్ కాకుండా మిగిలిన సభ్యులకు మెసేజ్ అందేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కచ్చితంగా ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తే అవకాశం ఉన్నదనేది కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయం. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన కేవలం స్పీకర్‌పైన మాత్రమే కాదని, గవర్నర్‌నూ లెక్కచేయకపోవడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే వ్యాఖ్యానించినందున సీఎం రిప్లైలో వచ్చే కామెంట్లపై ఆసక్తి నెలకొన్నది.