Guvvala Balaraju: బీజేపీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. కొద్ది రోజులుగా ఆయన చేరికకు సంబంధించిన అంశంపై సందిగ్ధత తొలగిపోయింది. కాషాయ పార్టీలో గువ్వల బాలరాజు చేరిక లాంఛనమైంది. బీజేపీలో గువ్వల చేరికకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 10వ తేదీన ఆయన కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు అనుచరులు సైతం పార్టీలోకి చేరనున్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన గువ్వల కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఈ అంశంపై చర్చించేందుకే గువ్వల శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో ఆయన భేటీ అయ్యారు. చేరికకు రూట్ క్లియర్ చేసుకున్నారు.
గులాబీ పార్టీకి రాంచందర్ గట్టి దెబ్బ
గతంలో మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక ఖాయమవ్వడంతో శ్రేణుల్లో కొత్త జోష్ వస్తుందనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. జిల్లాల పర్యటనలో పేరిట ఇటు ప్రజా సమస్యలు.., అటు పార్టీలో సమస్యలపై రాంచందర్ రావు దృష్టిసారిస్తున్నారు. అలాగే చేరికలపైనా ఫోకస్ పెంచారు. ఆయన ఎన్నిక తర్వాత తొలి జాయినింగ్ కేసీఆర్ ఇలాకా నుంచి అవ్వడం గమనార్హం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వలను సైతం చేర్చుకుని గులాబీ పార్టీకి రాంచందర్ గట్టి దెబ్బ కొట్టారని చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయన జాయినింగ్స్ పై సీరియస్ గానే ఉన్నారని శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో గువ్వల బాలరాజుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ బీజేపీ నేతతో లావాదేవీలు నిర్వహించడంతో ఆయన బీజేపీ గూటికి చేరడం ఈజీ అయినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Cyber Fraud: రూ.260 కోట్ల మోసం.. సైబర్ ఫ్రాడ్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ
కాషాయ పార్టీలో మరికొందరు నేతలు
తెలంగాణ బీజేపీ రథసారథిగా రాంచందర్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జోష్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టిన కాషాయ పార్టీలో మరికొందరు నేతలు సైతం చేరుతారనే ప్రచారం జోరుగా జరిగింది. దాదాపు 18 మంది వరకు ముఖ్య నేతలు చేరుతారని ప్రచారం జరిగింది. అయితే వారి చేరికలో జాప్యం నెలకొంది. ప్రస్తుతమున్న తరుణంలో వారంతా చేరుతారన్నది అనుమానమే అనే చర్చ జరుగుతోంది. చేరేవారి జాబితాలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ పేర్లు వినిపించాయి. కానీ వారు పార్టీ వీడుతున్నారనే వార్తలను వారు ఖండించారు. అయితే సమయం చూసుకుని విడుతల వారీగా చేరుతారనే చర్చ సైతం జరుగుతోంది. ఆ ప్రక్రియ ఎన్నటికి పూర్తవుతుందనేది సస్పెన్స్ గా మారింది.
నల్లమలలో బీజేపీ జెండా ఎగురవేస్తా
నల్లమల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన శుక్రవారం వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. చేరికకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. ఆపై గువ్వల మీడియాతో మాట్లాడారు. ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు బీజేపీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. బీజేపీ మంచి విధానాలతో ముందుకు వెళ్తోందని ఆయన కొనియాడారు. అందుకే కాషాయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా తాను ఎంతో కష్టపడి బీఆర్ఎస్ జెండాను చెట్టుకు, పుట్టకు, ప్రతి ఇంటికి తీసుకెళ్లానని, ఇప్పుడు కూడా అదే తరహాలో బీజేపీ జెండాను ఇంటింటికీ తీసుకుని వెళ్తానని గువ్వల స్పష్టంచేశారు.
Also Read: TGSRTC Job Posts: త్వరలోనే పోస్టుల భర్తీకి కసరత్తు.. సజ్జనార్ స్పష్టం!