KTR: ఇక కేటీఆర్ స్పీడ్ పెంచబోతున్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటలకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ కేడర్ ను త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు సిద్ధం చేయబోతున్నారు. అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ పర్యటనలతో నేతల మధ్య ఏమైన మనస్పర్ధాలు ఉంటే వాటిని తొలగించి వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపబోతున్నారు. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
నియోజకవర్గాల టూర్ కు ప్లాన్
రాష్ట్రంలోస్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని అధిష్టానం భావిస్తుంది. మరోవైపు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులకు సైతం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నియోజకవర్గాల టూర్ కు ప్లాన్ ను పార్టీ రెడీ చేసింది. ఈ నెల 10న భద్రాచలం పర్యటన ఖరారైంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మారడంతో ఉప ఎన్నికలు కూడా వస్తాయని ఇప్పటికే పార్టీ ధీమాతో ఉంది. కేడర్ బలంగా ఉండటంతో ఇటు ఉప ఎన్నికలు, అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ పర్యటనను ఖరారు చేసినట్లు సమాచారం. ఏ ఎన్నికలు ముందుగా వచ్చినా ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను సాధించేందుకు వ్యూహాలను రచిస్తోంది.
పార్టీ కేడర్ తో మరింత జోష్
కేడర్ తో భేటీ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 11 కొత్తగూడెం నియోజకవర్గ పర్యటన సైతం ఫిక్స్ అయింది. ఈ నియోజకవర్గంలో సైతం పార్టీ కేడర్ బలంగా ఉంది. అయితే ఇక్కడ స్థానం కేడర్ ను స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్లాన్ రూపొందించారు. ఈ ఎన్నికలతో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గ్రౌండ్ సిద్ధం చేయాలని భావిస్తుంది. ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పర్యటనతో పార్టీ కేడర్ తో మరింత జోష్ నింపనుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నెల 13న గద్వాల పర్యటనను సైతం పార్టీ ఖరారు చేసింది. ఇక్కడ కూడా పార్టీ బలంగా ఉండటం, సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో నేతల్లో భరోసాతోపాటు మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
Also Read: Ambulance Vehicle: అంబులెన్స్ రాకతో అత్యవసర వైద్య సేవలు.. నిలుస్తున్న బాధితుల ప్రాణాలు!
నియోజకవర్గ పర్యటన
పర్యటనలతో కేడర్ ల్లో జోష్ నింపాలని కేటీఆర్(KTR) వరుస పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. నేతలు, కేడర్ మధ్య కొంత గ్యాప్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోవడంలేదని ద్వితీయశ్రేణి నాయకత్వం సైతం గుర్రుగా ఉంది.మరోవైపు నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య సైతం మనస్పర్ధాలు ఉన్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనలతో వారందరిని సమన్వయం చేసి ఏకతాటిపైకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు కోఆర్డినేషన్ తోనే స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నేతలకు సూచించనున్నారు. అలా అయితేనే మెజార్టీస్థానాల్లో సత్తాచాటవచ్చని, రాబోయేకాలంలో ఏ ఎన్నికలు వచ్చినా సునాయసంగా గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. నేతలకు నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక సైతం ఇవ్వబోతున్నట్లు సమాచారం. పర్యటనలో నేతలకు పార్టీ పదవులపై హామీలతో పాటు అండగా ఉంటామని మరోసారి భరోసా ఇవ్వబోతున్నారు.
ఎన్నికల సమయంలో
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి సందర్భాను సారంగా ఎలా తీసుకుపోవాలనేది కూడా కేటీఆర్(KTR) పర్యటనలో నేతలకు సూచించబోతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 20 నెలల పాలనలో నెరవేర్చిన గ్యారెంటీలు, పెన్షన్లు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎప్పటి నుంచి ఇంటింటి కార్యక్రమం చేపట్టాలి.. కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలి.. ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, కేసీఆర్ పై అనుసరిస్తున్న విధానాలను వివరించాలని నేతలకు మార్గనిర్దేశం చేయబోతున్నారు. అందివచ్చిన ఏ అంశాన్ని వదిలిపెట్టొద్దని, సద్వినియోగం చేసుకొని ముందుకుపోవాలని, రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అనే భరోసాను కేడర్ కు ఇవ్వబోతున్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడమే శరణ్యం అనే అంశాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు కేటీఆర్ సూచించబోతున్నారు. ఇంకా మూడేళ్లు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికీ ఇప్పటి నుంచే కేడర్ ను సన్నద్ధం చేసేందుకు కేటీఆర్ నిమగ్నమయ్యారు.
Also Read: Minister Seethakka: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా?.. మంత్రి సీతక్క ఫైర్