Bhanakacherla Project: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్‌ను మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ (BRS) పార్టీయే అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్‌కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది (BRS) బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు.
మళ్లీ అవే పాత అబద్ధాలు ప్రచారం చేస్తున్న ఆయన, అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా అంటూ నిలదీశారు. డబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం, సీడబ్ల్యూసీ అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదన్నారు. ఏపీ అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలనే సోయి కూడా లేదు అంటూ మండిపడ్డారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యంగా పేర్కొన్నారు.
Also Read: Bhanakacherla Project: మాకు సీమ రొయ్యల పులుసు అవసరం లేదు!
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది అంటూ మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్ధాలు ప్రచారం చేస్తూ, (BRS) బీఆర్ఎస్ పై చేస్తున్న క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ఈ సారి కూడా పంట బీమా లేనట్లేనా?
పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాలుగు సీజన్లుగా అమలు చేయకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు కోటలు దాటితే, రేవంత్ (Revanth) ఆచరణ గడప కూడా దాటదు అనడానికి ఇప్పటికీ అమలు కాని పంటల బీమా మరో ఉదాహరణ అన్నారు. ఎన్నికలు వస్తే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక ‘మొండిచేయి’ చూపడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రోట్లో తలపెట్టిన చందంగా రైతుల పరిస్థితి మారిందన్నారు.
రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అటకెక్కించారని ఆరోపించారు. సన్నాలకు 1200 కోట్ల బోనస్ డబ్బులను ఇప్పటికీ చెల్లించక రైతులకు బాకీ పడ్డారన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, ఎన్నికల మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగాల్లో పంట బీమా అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.
Also Read:Negative Energy: ఆడవాళ్ళు ఎక్కడపడితే అక్కడ తలదువ్వుకుంటున్నారా? అయితే జరిగేది ఇదే!