KTR: కంటోన్మెంట్ బోర్డును కార్పొరేషన్ లోకి విలీనం చేయడానికి లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీన అంశాన్ని రాజకీయ డ్రామాగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విలీనంపై దీక్షలు చేపట్టిన వారు అసలు దీక్ష ఎందుకు మొదలుపెట్టారు ? ఎందుకు విరమించారు ? అనే అంశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వలేదన్నారు.
బీఆర్ఎస్ ముందుకొస్తోంది
విలీన అంశం ప్రజా సమస్య అని, ఇలాంటి అంశాన్ని తీసుకుంటే పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడాలన్నారు. కానీ దీక్ష పేరుతో స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేకుండా, ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. విలీనంపై బీజేపీతో సహా వివిధ వేదికలపై విభిన్న వ్యాఖ్యలు రావడంతో ప్రజల్లో సందిగ్ధత పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా చూపించేందుకు బీఆర్ఎస్ ముందుకొస్తోందన్నారు. కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, ప్రజల ఆకాంక్షను కేంద్రం, రాష్ట్రం సహా సంబంధిత అధికారులకు అందజేస్తామన్నారు.
సంతకాల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి
కంటోన్మెంట్ విలీనాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఈ లక్ష సంతకాల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని, కంటోన్మెంట్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని ఈటల రాజేందర్ అనడం స్థానిక బీజేపీ ఎప్పటినుంచో కంటోన్మెంట్ బోర్డ్ విలీనం వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం వారి వైఖరిని తెలియజేసిందన్నారు. ఒక పూట తినకుండా ఎనిమిది రోజులు డ్రామా చేసి కనీసం వాళ్ళ కాంగ్రెస్ ఒక్క మంత్రి కూడా తన దీక్షకు రాకపోవడం అకస్మాత్తుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ దీక్షను విరమించడం కేవలం రాజకీయ స్టంట్ కోసమే కంటోన్మెంట్ బోర్డ్ విలీన అంశాన్ని ఎత్తుకున్నారని అర్థమవుతుందన్నారు.బీఆర్ఎస్ లక్ష సంతకాల సేకరణను పూర్తి చేసుకొని ఈటలకు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి, రాహుల్ గాంధీకి ఈ పత్రాల కాపీ పంపించి కంటోన్మెంట్ బోర్డ్ కార్పొరేషన్ లోకి విలీనంపై ఎంత స్పందన ఉందో తెలియజేసే కార్యక్రమం గురువారం నుంచి చేపడుతుందన్నారు.

