BRS Party: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(Local body election voters list revision process)ను తక్షణమే వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను భారత రాష్ట్ర సమితి(BRS) కోరింది. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్సీలు ఎల్.రమణ(L Ramana), డాక్టర్ శ్రావణ్ దాసోజు(Dhasoju Srevan) రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖను అందజేశారు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మెదక్(Medak), సంగారెడ్డి(Sangareddy), సిద్దిపేట(Sidhipeta), కామారెడ్డి(kamareddy), నిజామాబాద్(Nizamabad), ములుగు(Mulugu), భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం(Khammam), వరంగల్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరదలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, వేలాది పశువులు మృత్యువాత పడ్డాయని, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు తమ ప్రాణాలను, ఆస్తులను, పశువులను, పంటలను కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారని, ఓటర్ జాబితాలో తమ వివరాలను తెలుసుకునే అవకాశం లేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ (No. 548/TGSEC-PR/2025) ప్రకారం ఓటర్ల జాబితా సవరణకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు కేవలం ఐదు రోజుల గడువు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. రాబోయే 3-5 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఈ ప్రక్రియలో ప్రజలు గానీ, అధికారులు గానీ ఈ ప్రక్రియలో పాల్గొనడం అసాధ్యమని తెలిపింది. చాలా పంచాయతీ కార్యాలయాలు నీట మునిగి ఉన్నాయని, జాబితాల పరిశీలన కష్టమని వివరించింది.
Also Read: Tribandhari Barbarik: దర్శకుడు మెచ్చిన కథ ఎలా మొదలైందంటే?.. రండి తెలుసుకుందాం..
జిల్లా కలెక్టర్లతో కొత్త షెడ్యూల్
క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు స్థానిక సంస్థల ఓటర్ల జాబితా రూపకల్పన, ప్రచురణ ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కోరింది. వరద పరిస్థితిని సమీక్షించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో సంప్రదించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఓటర్లు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనేలా పారదర్శకమైన వాతావరణంలో ఈ ప్రక్రియను భవిష్యత్తులో చేపట్టాలని సూచించింది. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రజలను మరింత ఇబ్బంది పెట్టకుండా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను వాయిదా వేసి, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.
Also Read: Ganesh Chaturthi: మానుకోట ఖమ్మం జిల్లాలో ఘనంగా గణనాథుల ఉత్సవాలు!
