TG Congress: రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ కాగా, బీఆర్ఎస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగానే ద్రోహం చేస్తున్నాయని కాంగ్రెస్ మండిపడుతున్నది. హైకోర్టు స్టే పై బీసీ నేతలు కూడా రగిలిపోతున్నారు. ఈ రెండు పార్టీల రహస్య అజెండా వల్లే బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ చేస్తున్న విశ్వ ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకుంటున్నాయని బీసీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, తద్వారా ఎన్నికలు వాయిదా పడడం వంటి పరిణామాలకు బీజేపీ, బీఆర్ఎస్ కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులు, చేసిన చట్ట సవరణలు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదని వారు అంటున్నారు.
మైలేజ్ వస్తుందనేనా?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కితే, ఇక తెలంగాణలో తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ కుట్రకు తెరలేపాయని బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల వైఖరిపై బీసీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం హైకోర్టు వద్ద కొందరి అడ్వకేట్ల దగ్గర మాటలు కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచాయి. తమ నోటికాడ ముద్దను లాగేసుకోవడంపై వారు సైతం రగిలిపోతున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతిని ఓర్చుకోలేని బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డు పడుతున్నాయని విమర్శిస్తున్నారు. దీంతోనే నిరసనలు తెలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
Also Read: Khammam District: ఆ ఊరులో నయా దందా.. అక్రమ వసూళ్లతో నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి బ్రేక్
అన్నీ చేసినా.. ఆమోదం ఏది?
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద నాలుగు నెలల పాటు పెండింగ్‌లో ఉండడం వెనుక బీఆర్ఎస్, బీజేపీ కుట్ర ఉందని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వీరి కుట్రలను ఛేదించడానికి కాంగ్రెస్, రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీన్ని కూడా ఆమోదం పొందనివ్వలేదని, అయినా కూడా బీసీ రిజర్వేషన్ల అమలుకు ఏ అవకాశాన్ని వదులుకోకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో ప్రయత్నంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019లకు సవరణలు చేసిందంటున్నారు. వీటిని కూడా గవర్నర్ ఆమోదించకపోవడానికి బీఆర్ఎస్, బీజేపీల దోస్తీయే కారణమని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బిల్లుల ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టిన రోజున కాంగ్రెస్ నేతలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఈ రెండు పార్టీలే అడ్డుకున్నాయని గుర్తు చేస్తున్నారు. జీవో 9కు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టు కేసులో ఇంప్లీడ్ కాకపోవడం ఈ రెండు పార్టీల కుటిల రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యనిస్తున్నారు. ఆ రెండు పార్టీల కుట్రల వల బీసీలకు అదనంగా రావాల్సిన 23,973 పదవులు పెండింగ్‌లో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
