– తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయి
– 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు..
– 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మాకు టచ్‌లో ఉన్నారు
– మణిపూర్ ఘటనపై మోడీ ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు
– కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే నాశనమే
– ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న గజ్జెల కాంతం
హైదరాబాద్, స్వేచ్ఛ: బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యాయని టీపీసీసీ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు టచ్‌లో ఉన్నారని చెప్పారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్రంలో నరేంద్ర మోడీ ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదు. మళ్ళీ బీజేపీ గెలిస్తే దేశంలో సంపద అంతా బడాబాబులకు అప్పజెప్తారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనకు మోడీ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు తుపాకులు ఇచ్చి వందల మందిని చంపారు. ఆదానీ, అంబానీలకు ఖనిజ సంపద కోసం, మైనింగ్ కోసం వేలమందిని పొట్టన బెట్టుకున్నారు. మోడీ నోరు ఇప్పటికి విప్పలేదు, దీనిని దేశ ప్రజలు గమనిస్తున్నారు. గుజరాత్‌లో 41వేల మంది దళిత, గిరిజనుల మహిళలను అత్యాచారం చేసి కనిపించకుండా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో 6వేల మంది దళిత యువకులను చంపితే మోడీ మాట్లాడలేదు.
Also Read: రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. 13 జిల్లాలకు అలర్ట్
ఆర్మీని కూడా ప్రైవేటుపరం చేశారు. పార్లమెంట్‌లో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 7వందల మంది రైతులను చంపారు. ఎస్సీ వర్గీకరణపై ఎందుకు బిల్లు పెట్టలేదు. దుర్మార్గ పరిపాలన చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తున్న మందకృష్ణ మాదిగ ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణలో మాదిగలను మోసం చేసి ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితులను చంపుతారు. వర్గీకరణ చేసి దళితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యం’’ అని అన్నారు గజ్జెల కాంతం.