Weather Update: రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దంతా ఎండలు కొడుతుండగా.. సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా అధిక ఉష్ణోగ్రతలు (40 నుంచి 45 డిగ్రీల వరకు) నమోదవుతుండగా.. సాయంత్రంపూట ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని బేగంపేట్ వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా ఈ 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాజధాని నగరంలోనూ ఈ పరిస్థితులు ఉండనున్నాయి. ఈ 13 జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోనూ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల జాబితాలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, వికారాబాద్, హనుమకొండ, ఖమ్మం, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతోపాటుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: చెట్టెక్కిన జూపల్లి.. అసలు విషయం వేరే ఉందిలే!
శుక్రవారం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భారీ వర్షం కూడా కురిసింది. వనపర్తిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ శివారులో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి.