BL Santhosh: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. 2028లో గద్దెనెక్కడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర సంఘటనాత్మక కార్యశాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు నేతలతోనే బీఎల్ సంతోష్ కీలక సమావేశం నిర్వహించారు.
అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలతోనూ వేర్వేరుగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నేతల పనితీరుపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రధానంగా 2028 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. 2028లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడిగా సమావేశమైన ఆయన.. కలిసి కట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ఎవరికి వారుగా వెళ్తే, పార్టీకే కాదు, వ్యక్తిగతంగా నేతలు కూడా నష్టపోతారని ఆయన కఠినంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఫలితాలపై ఆత్మ సమీక్ష చేసుకోవాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై నేతలు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సంతోష్ సూచించినట్లు వినికిడి. పార్టీకి కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. నేతలు తమ పనితీరుతో పార్టీ పదవులకు వన్నె తీసుకురావాలని హితవు పలికినట్లు చెబుతున్నారు. పార్టీ పదవులను సొంత వ్యాపారాలు, వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకునే వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినికిడి.
సొంత వ్యాపారాల కోసం పార్టీ పదవులను ఉపయోగించే వారిపై చర్యలు తప్పవని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పని పక్కన పెట్టి, పదవులు తీసుకొని సొంత పనులు చేసుకునే వారు వారం తట వారే స్వయంగా తప్పుకుంటే మంచిదని కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. ప్రతి నాయకుడిపై కేంద్ర పార్టీ నిఘా ఉంటుందని సంతోష్ తేల్చి చెప్పినట్లు టాక్. కష్టపడి పనిచేసే నేతలకు కేంద్ర పార్టీ ఖచ్చితంగా గుర్తింపు, అవకాశాలు ఇస్తుందని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ అప్పగించిన పని చేస్తూ పోతే వారికి ఎలా న్యాయం చేయాలో హైకమాండ్ చూసుకుంటుందని వివరించినట్లు తెలిసింది.
Also Read: Telangana BJP: ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఇక చాలు ఆపేద్దాం అంటున్న బీజేపీ నేతలు
ప్రెసిడెంట్ ఎవరున్నా.. బాస్ ఈజ్ బాస్
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుపై కొందరు నేతల వైఖరి ఏమాత్రం బాలేదని, ఆయన్ను లైట్ తీసుకుంటున్నట్లుగా తమకు రిపోర్ట్ ఉందని వివరించినట్లు తెలిసింది. రాంచందర్ రావు స్ట్రాంగ్ ప్రెసిడెంట్ అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. ప్రెసిడెంట్ ఎవరున్నా.. బాస్ ఈజ్ బాస్ అంటూ స్పష్టంచేసినట్లు తెలిసింది. అధ్యక్షుడు సమావేశం పెడితే లైట్ తీసుకున్నట్లు తెలుస్తోందని, తమ దృష్టికి ప్రతీదీ వస్తుందని ఆయన హెచ్చరించారు. మరోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఆయన పరోక్షంగా రాజాసింగ్, ఎంపీ అరవింద్‌నే టార్గెట్ చేసుకుని మాట్లాడి ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రెసిడెంట్‌గా రాంచందర్ రావు ఫైనల్ అయ్యాక డమ్మీ టీమ్ అంటూ రాజా సింగ్ విమర్శించారు. అరవింద్ సైతం జూబ్లీహిల్స్ బై పోల్ సమయంలో నోరు పారేసుకోవడంపై ఆయన ఈ కామెంట్స్ చేసి ఉంటారని చెబుతున్నారు.
పార్టీ క్యాడర్‌ను లీడర్లుగా తయారు చేసుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికలను వినియోగించుకుని పార్టీ క్యాడర్‌ను లీడర్లుగా తయారు చేసుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని, అయితే దానిని మాత్రమే నమ్ముకోవద్దని, జనంలోకి వెళ్లి వారి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. జనంలోకి వెళ్లకుండా, గాలి మాటలు చెప్పే వారు పదవుల నుంచి తప్పుకోవాలంటూ సంతోష్ తీవ్ర హెచ్చరిక చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీల్లో ఫొటోల వరకే పరిమితం కాకుండా జనం గుండెల్లో స్థానం సంపాదించండని నేతలకు సంతోష్ పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.
జమిలి ఉండబోదని సంకేతాలు
జమిలీ ఎన్నికలపై బీఎల్ సంతోష్ ఇక్కడి నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పట్లో జమిలి ఉండబోదని సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళకు 33 శాతం రిజర్వేషన్లు కూడా వస్తాయని సూచించినట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మహిళా లీడర్లు పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. నాయకుల పేరు చెప్పుకుని పని చేయడం కాదని, నాయకుల వెంట ఉంటే మిమ్మల్ని గుర్తించేలా కాకుండా లీడర్‌గా ప్రజలు తమను గుర్తుపట్టేలా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. లీడర్స్‌ను నమ్ముకోవద్దని, ఆఖరుకు తనను నమ్మి సైతం పని చేయొద్దని, కేవలం పార్టీని నమ్ముకుని పని చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లీడర్స్ మాట్లాడితే ఎవరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో అర్థమై పోతుందని, అందుకే నాయకుల కోసం కాకుండా పార్టీ కోసం మాట్లాడాలంటూ సూచనలు చేసినట్లు సమాచారం. 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న కాషాయ పార్టీ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read: Operation Akarsh: బీజేపీలో నేతల మధ్య చిచ్చు పెడుతున్న చేరికలు
