BJP Telangana: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్టీ మారిన శాసనసభ్యులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నదని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ (BJP Telangana) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Aleti Maheshwar Reddy) కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!
తుది నిర్ణయం తీసుకోలేదు
అయితే, గడువు ముగిసినా ఈ అంశంపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోలేదని, ఇది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించటమే అని పేర్కొంటూ ఏలేటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కావాలనే స్పీకర్ నిర్ణయాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఫిరాయింపుల వ్యవహారంలో స్పష్టత లేకపోవడాన్ని, స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుందో అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్
అధికార పార్టీకి సానుకూలంగా ఉండేలా నిర్ణయాన్ని స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరత్వంపై ప్రభావం పడుతుందని పేర్కొంటూ అందుకే స్పీకర్ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దీని వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని ఏలేటి పేర్కొన్నారు. ఆయన దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

