Somu Veerraju on YCP: విపక్ష వైఎస్సార్‌సీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీకి కనీసం 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని ధ్వజమెత్తారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారని, అందుకే అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నాయకుడు శాసన సభకు వెళ్లడంలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ పట్టుబట్టడం సబబుకాదన్నారు. 2014లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ సభకు వెళ్లలేదని సోము వీర్రాజు గుర్తుచేశారు. ఇక, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కట్టబెట్టలేదని, ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ రెండు నాలుకల వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ పెద్ద గుంట నక్క
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పెద్ద గుంట నక్క అని సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి తెలంగాణను పదేళ్లపాటు పాలించారని విమర్శించారు. కేసీఆర్ మాయల మరాఠీ, ప్రస్తుతం జనం నమ్మకపోవడంతో బీజేపీపై అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Attack on Mumbai Actress: అర్ధరాత్రి నటి గదిలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు.. తర్వాత ఏమైందంటే?
బీజేపీ నేతలు గుంట నక్కలు అని వ్యాఖ్యానించి కేసీఆర్, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేసీఆర్ రాత్రి సమయంలో సరిగా నిద్రపోవడంలేదని, కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావుల గురించి ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు.