Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కాషాయ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ (Ramchandra Rao) నియామకం అనంతరం ఒక్కో అడుగు ముందుకు పడుతున్నది. జిల్లా పర్యటనలు సైతం చేపట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఆయన జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలతో పాటు నాయకులకు వర్క్‌షాప్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే జాయినింగ్స్ పేరిట స్పీడ్ పెంచిన కాషాయ దళం అటు కాంగ్రెస్‌కు (Congress) ఇటు బీఆర్ఎస్‌కు (BRS) గట్టి షాకిచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కమల దళం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా వేటు తప్పదనే మెసేజ్‌ను రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో స్పష్టమైంది. దీంతో అంతా సెట్ అయిందనే ధీమాతో పార్టీ ఉంది.
Also Read: MLC Kavitha: నేను ఊరుకునే ప్రసక్తే లేదు.. ఎమ్మెల్సీ కవిత
కాషాయ పార్టీకి సవాళ్లు తప్పవనే చర్చ
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎలక్షన్‌లో కాషాయ పార్టీకి సవాళ్లు తప్పవనే చర్చ జరుగుతున్నది. బీజేపీకి కొన్ని జిల్లాల్లో అసలు పట్టే లేదనేది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు (Local Body Elections) ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో బీజేపీకి క్యాడర్ బలంగా లేదు. మిగతా జిల్లాల్లో ఎంతోకొంత పట్టు సాధించిన బీజేపీకి నాయకత్వ లేమి తీవ్రంగా వేధిస్తున్నది. జిల్లాల్లో గట్టిపట్టున్న లీడర్లు కాషాయ పార్టీలో లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల కోసం పక్కచూపులు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది.
తెలంగాణ బీజేపీలో పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్ క్రమంగా తగ్గిపోయిందని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటం చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా ముందడుగు వేయకపోవడం వల్లే క్యాడర్‌లో నిరుత్సాహం ఆవరించినట్లు తెలుస్తున్నది. అందుకే కమలం పార్టీ క్రమంగా ప్రజల్లోకి వెళ్లి యాక్టివిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే నాయకులు, కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసేలా ప్లాన్ చేస్తున్నది.
కొత్త అధ్యక్షుడితో కలిసొచ్చిందనే భావనలో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 80 మంది నేతలను పార్టీలో చేర్చుకోవడం తమకు కలిసొచ్చిందనే భావనలో కమలం నేతలు ఉన్నారు. ఈ పాజిటివ్ వైబ్స్‌ను ఇలాగే కంటిన్యూ చేయడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. అందుకే నాయకులతో కార్యశాలలు నిర్వహించనుంది. ఈ రెండు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా రాంచందర్ రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్లనున్నారు. మునుగోడు, చౌటుప్పల్, నకిరేకల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్లగొండ పట్టణంలో పలువురిని కలుస్తూ సమావేశమవ్వనున్నారు. అనంతరం సూర్యాపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆపై కార్యకర్తలతో సమావేశమవుతారు.
ఆపై ఆయన స్వగ్రామం కోదాడ నియోజకవర్గం నల్లబండగూడెంలో వివిధ వర్గాలు, గ్రామస్తులతో సమావేశమై రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఈనెల 15న స్వగ్రామంలో రైతులతో సమావేశమై ఆపై కోదాడకు చేరుకుని రైతులతో భేటీ అవుతారు. అనంతరం చౌటుప్పల్ ఔషాపూర్‌లో నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్ షాప్ నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌కు సునిల్ బన్సల్ సైతం హాజరయ్యే అవకాశమున్నది. అనంతరం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని మండల అధ్యక్షులతోనూ వారు భేటీ అవ్వనున్నారు. పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాషాయ పార్టీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది చూడాలి.
Also Read: MLC Kavitha: పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన కవిత.. బస్తీమే సవాల్