Vijayawada West: టికెట్ ఇచ్చింది బీజేపీ.. కానీ, చంద్రబాబు తనకు దైవంతో సమానం అని విజయవాడ వెస్ట్ అభ్యర్థి సుజనా చౌదరి చెబుతున్నారు. ఆయన ముందు టీడీపీ నాయకుడే. బీజేపీతో టీడీపీ విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన కమల దళంలో చేరారు. పార్టీ మారారు కానీ, ఆయనలో లోలోపల టీడీపీపై, చంద్రబాబుపై అభిమానాన్ని అలాగే కొనసాగింది. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలూ మరోవైపు ఉండనే ఉన్నాయి.
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఈ రోజు మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో ఉన్నా తనకు రాజకీయ గురువు చంద్రబాబే అని తెలిపారు. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు కదా అని గుర్తు చేస్తూ.. తనకు చంద్రబాబు కూడా దైవంతో సమానం అని వివరించారు. ఇటు టీడీపీని పొగడటంతోపాటు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పైనా ప్రశంసలు కురిపించారు. టీడీపీ, బీజేపీని ఏకతాటి మీదికి తేవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేసి సఫలం అయ్యారని, సీట్లనూ త్యాగం చేశారని వివరించారు. నాగబాబు కూడా సీటు త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read: కన్నబిడ్డ మృతదేహాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి.. ఇదేనా రాజన్న పాలనా?
విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి దక్కింది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని జనసేన నుంచి పోతిన మహేశ్, టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న కూడా భావించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఈ సీటులో ముస్లిం అభ్యర్థినే బరిలోకి దింపితే గెలుస్తారని, తనకు ఆ అవకాశం ఇవ్వాల్సిందని జలీల్ ఖాన్ మాట్లాడారు. కానీ, పొత్తులో భాగంగా సీటు బీజేపీకి వెళ్లింది. ఇక్కడ జనసేనకు గ్రౌండ్‌లో కొంత బలం ఉన్నది. జనసేన కార్యకర్తలూ క్రియాశీలకంగా ఉన్నారు. వీరంతా తనకు కలిసి వస్తారని సుజనా ఆశించారు. కానీ, పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేసి అనుచరులతో వైసీపీలోకి వెళ్లారు. టీడీపీ అధిష్టానం సర్దిచెప్పడంతో జలీల్ ఖాన్, బుద్దా వెంకన్నలు కన్విన్స్ అయ్యారు.
అయినా.. ఈ మూడు పార్టీల ఓట్లను సుజనా చౌదరి ఆకట్టుకోవాల్సి ఉన్నది. ఈ తరుణంలోనే సుజనా చౌదరి మరోసారి చంద్రబాబును నెత్తినపెట్టుకున్నారు. జనసేనపైనా పొగడ్తలు కురిపించారు. వైసీపీ నుంచి ముస్లిం వర్గానికి చెందిన ఆసిఫ్ ఇక్కడ బరిలో ఉన్నారు.