Nitish Kumar: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల సరళి ఎన్డీఏ కూటమికి చారిత్రక విజయాన్ని అందించింది. మొత్తం 243 సీట్లకుగాను ఎన్డీఏ 200లకు పైగా స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ విజయం, కూటమిలోని ప్రధాన భాగస్వాములైన బీజేపీ(BJP), జనతాదళ్(Janata Dal) మధ్య ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి సమీకరణాలు ఉంటాయనే చర్చకు దారితీసింది. బిహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజా సీట్ల లెక్కల ప్రకారం, బీజేపీ(BJP) 90 సీట్లలో గెలవగా, జేడీయూ 79 సీట్లు దక్కించుకున్నది. ఎన్డీఏ కూటమి మొత్తం 200+ సీట్లతో మెజారిటీ మార్కును సునాయాసంగా దాటింది. బీజేపీ ఒక్కటే మెజారిటీ మార్కుకు చేరుకోనప్పటికీ, కూటమిలోని ఇతర మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, ఇతర పార్టీల సీట్లను కలుపుకుంటే, కమలం పార్టీకి సాంకేతికంగా జేడీయూ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీట్ల బలం ఎన్డీఏ కూటమికి ఉంది. అయినప్పటికీ, కూటమి ధర్మాన్ని పాటించడం ఇక్కడ కీలకం కానుంది.
Also Read: Gadwal: గద్వాల గోనుపాడులో వెంచర్ స్థలం కబ్జా.. మాజీ నాయకుడే అనుమతిచ్చాడు అంటూ వ్యాపారి
మహా సీన్ రిపీట్ అయితే?
సీట్ల సంఖ్య ఆధారంగా బీజేపీ(BJP)కి సీఎం పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం కూటమి సమావేశంలో తీసుకోనుంది. అత్యధిక సీట్లు సాధించిన నేపథ్యంలో బీజేపీ తమ రాష్ట్ర అధ్యక్షుడు లేదా మరో సీనియర్ నాయకుడికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించమని కోరే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో శివసే(Shiva Sena)నకు చెందిన ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) సీఎంగా ఎన్నికలకు వెళ్లగా, బీజేపీ ఆధిపత్య ప్రదర్శన తర్వాత ఆ పదవి చివరికి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)కు పీఠం కట్టబెట్టింది. అదే విధంగా బిహార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి(Samrat Chaudhary)కి సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో ఉందనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే, కూటమి ఐక్యతను కాపాడటం కోసం నితీశ్ కుమార్‌కు మళ్లీ అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు కూడా లేకపోలేదు. ఇదేగానీ జరిగితే ఏకంగా 10వ సారి బిహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిశ్ రికార్డు సృష్టించినట్లే. ఏదేమైనా, బిహార్‌లో బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించడం, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలపై దాని పట్టు పెరిగేందుకు మార్గం సుగమం చేసింది. తుది నిర్ణయం ఎన్డీఏ అధిష్టానం రాజకీయ సమీకరణాలు, కూటమి ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
Also Read: Crime News: నకిలీ పత్రాలతో 52 డొల్ల కంపెనీల ఏర్పాటు.. ఇద్దరు అరెస్ట్.. పరారీలో మాస్టర్ మైండ్..!

