Bandla Krishna Mohan Reddy: గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) ప్రజలకు పిలుపునిచ్చారు. గద్వాల నియోజకవర్గం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్డకల్ మండల పరిధిలోని మద్దెల బండ, మద్దెల బండ పెద్ద తండా, నేతివాని పల్లి, దాసరపల్లి గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. తాను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు.
మల్డకల్ అభివృద్ధికి కృషి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మల్డకల్ మండల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, మంచి నీటి సౌకర్యం, విద్యుత్, పాఠశాలల అభివృద్ధి కోసం పాటుపడ్డానని పేర్కొన్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాల వారికి కమ్యూనిటీ హాళ్లను నిర్మించుకోవడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. హిందువులకు దేవాలయం దగ్గర, ముస్లింలకు మసీదుల దగ్గర, క్రిస్టియన్లకు చర్చి దగ్గర కమ్యూనిటీ హాళ్లను నిర్మించడానికి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Also Read: MLA Krishna Mohan Reddy: ఆ గ్రామంలో పండగ వాతావరణం.. ఘనంగా చీరలు పంపిణీ కార్యక్రమం
సంక్షేమ పథకాల అమలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్లు, మరియు ఐదు లక్షల రూపాయల మంజూరు చేయించి ఇవ్వడం జరిగిందన్నారు.
గ్రామాల అభివృద్ధి తన లక్ష్యం
అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఉచిత సన్న బియ్యం పంపిణీ కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధి తన లక్ష్యమని, తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, సత్యం రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, మాజీ సర్పంచ్‌లు భరత్ రెడ్డి, వీరేశ్ నాయక్, నాయకులు దివాకర్ రెడ్డి, రమేశ్ రెడ్డి, నారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Anganwadi Teachers: ఫ్రీ ప్రైమరి టీచర్స్‌గా అంగన్వాడీ టీచర్లను నియమించాలి.. మంత్రికి వినతి

