Bandi Sanjay: ఫార్ములా ఈ రేసు అంశంపై కేటీఆర్‌ను విచారణ చేసేందుకు గవర్నర్ ఆమోదం రావొద్దని కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై కేటీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపుతామని గతంలో అన్నారని, మరి జైలుకు పంపకుండా కేంద్రంపై ఎందుకు నెపం వేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిజేపీ నేతల మధ్య అభిప్రాయ భేదాలు అవాస్తవమని, తనపై ఎవరికైనా అభిప్రాయ భేదాలు ఉంటే తీసేయాలని బండి సూచించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
అర్బన్ నక్సల్స్‌తో ప్రమాదం
నగరాలు, పట్టణాల్లో ఏసీ రూమ్‌లో ఉండి మాట్లాడే అర్బన్ నక్సల్స్ అడవిలో ఉండే వారిని లొంగిపోవాలని ఏనాడైనా చెప్పారా అని బండి ప్రశ్నించారు. ఓవైపు జల్సాలు చేస్తూ నామినేటెడ్ పదవులు పొందుతున్నారన్నారు. భారత్‌ను 2047లో అగ్ర రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని వివరించారు. మరి మావోయిస్టుల లక్ష్యం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తుపాకీలు పట్టి కాల్చి చంపడమే లక్ష్యమా అని నిలదీశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హమీలు విస్మరించిన సర్కార్‌తో ఎందుకు భాగస్వాములు అయ్యారని ప్రశ్నించారు. నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకున్నారని, కమిటీల్లో ఎందుకు ఉన్నారన్నారు.
Also Read: Etela vs Bandi Sanjay: కులం మతంతో రాజకీయాలు నిలబడవు.. బండి వర్సెస్ ఈటల వార్..!
టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు
పాటలు, మాటల ద్వారా మైనర్లను రెచ్చగొట్టి అడవుల్లోకి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నక్సల్స్ 10 రోజులు అడవుల్లో తిరిగితే వారికి తెలుసొస్తుందని చురకలంటించారు. నైతికత ఉంటే ప్రభుత్వంలో భాగస్వాములై పదవులు పొందిన వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద మావోయిస్టులు లొంగిపోతున్నారని, లొంగిపోండి అని చెప్పని మూర్ఖపు సిద్ధాంతం దేనికని నిలదీశారు. అడవుల్లో ఉన్న వాళ్లు ప్రధాని మోదీ అభివృద్ధిని గుర్తించారని, కానీ అర్బన్ నక్సల్స్ గుర్తించడం లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు, రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఎవరి ఆలోచనలు వారివని, అయితే దర్శకుడు రాజమౌళి దేవుడిని నమ్మేలా కరుణ కటాక్షాలు కలిగించాలని కోరారు. ఇక, టెన్త్ పేపర్ లీక్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చేయని తప్పునకు తనను జైలుకు పంపారన్నారు. మానవత్వం మరిచి తనపై, బీజేపీ కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించారని మండిపడ్డారు.
Also Read: Bandi Sanjay: మావోయిస్టులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
