AVN Reddy: ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ఎన్నో ఏండ్లు పడుతుందన్నారు. ప్రభుత్వ సర్వీసులు సరిగ్గా లేనప్పుడు ప్రైవేట్ వైపు ప్రజలు చూస్తారన్నారు.
Also Read: Minister Sithakka: అమ్మాయిల స్వీయ రక్షణకు.. బాలికా రక్షక టీంలు!
ప్రభుత్వ రంగ వ్యవస్థలను బలోపేతం చేయాలి
ప్రజలకు మధ్య అంతర్యాలు పెరిగితే అరాచకాలు పెరుగుతాయన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం లేకపోతే సమాజం అభివృద్ధి సాధించడం అసాధ్యమని ఎవీఎన్ రెడ్డి స్పష్టంచేశారు. అందుకే ప్రభుత్వ రంగ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయొద్దని స్పష్టంచేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు చెల్లించడం లేదన్నారు.
ఉచితాలకు తాము వ్యతిరేకం కాదు
రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, ఆర్థికంగా సరైన ప్రణాళిక లేదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, అది లేకుండా ఉద్యోగులు ఇబ్బందులు పడుతారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు రిటర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదన్నారు. ఉచితాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచితాలే ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయనడం తప్పని ఏవీఎన్ రెడ్డి స్పష్టంచేశారు.
పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి
ఉచిత పథకాల కంటే ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య, వైద్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకుండా పిల్లలను బడికి ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులకు కేవలం రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని, అవి కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.
Also Read: Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా?