Amit Shah తెలంగాణ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ నియామకం తర్వాత తొలిసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) హైదరాబాద్ కు వస్తున్నారు. భాగ్యనగరంలో ఈనెల 6వ తేదీన జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవాలకు షా హాజరవ్వనున్నారు. ఆయన గణేషుడి నిమజ్జనానికి అధికారికంగా వస్తున్నా తెర వెనుక మరో కోణం ఉన్నట్లుగా తెలుస్తోంది. కమలం పార్టీలో కల్లోలం కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తెలంగాణ రాక ఆసక్తికరంగా మారింది. నేతల మధ్య విభేదాలు, అంతర్యుద్ధం వంటి అంశాలు కండ్ల ఎదుట మెదులుతున్న తరుణంలో తెలంగాణకు వస్తుండటం శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది. పార్టీలో నేతల మధ్య కొసాగుతున్న అంతర్యుద్ధానికి సంబంధించిన పలు అంశాలు ఈ చర్చలోకి వచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఈ సందిగ్ధతకు షా టూర్ తో తెరపడుతుందా? అనే అంశం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Also Read: PM Condolence Message: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన అల్లు అరవింద్.. ఎందుకంటే?
ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు
టీబీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఇటీవలే జరిగింది. త్వరలో నూతన కార్యవర్గాన్ని సైతం పార్టీ ప్రకటించునుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆయన ఎన్నిక తర్వాత నుంచి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కృషిచేస్తున్నారు. కాగా పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సిన ఇతర నాయకులు కూడా కేవలం తమ వ్యక్తిగత ఎదుగుదల, పేరు కోసం పరితపిస్తుండటం, విభేదాలకు కారణమవుతుండటం పార్టీలో నిత్యకృత్యంగా మారింది. పలువురు నేతల కారణంగా ఈ సమస్య ఎదురవుతున్నట్లుగా హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమిత్ షా వస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు.
ఈ అంశాలను చక్కబెట్టేందుకే
త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం జరగనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు గ్రౌండ్ లెవల్ నుంచి బలోపేతమయ్యేందుకు కాషాయ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ముందకు వెళ్లాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హైకమాండ్ భావిస్తోంది. నేతలు వ్యక్తిగత విభేదాలతో అంతర్యుద్ధానికి కారణమవుతున్నారని గ్రహించినట్లు సమాచారం. ఈ అంశాలను చక్కబెట్టేందుకే అమిత్ షా రంగంలోకి దిగబోతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత రాజకీయ అంశాలే కాకుండా కాళేశ్వరంపై సీబీఐ విచారణ అంశం ప్రస్తావనలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కవిత ఎపిసోడ్ తో పార్టీకి జరిగే లబ్ధి వంటి అంశాలు సైతం చర్చించే అవకాశాలున్నాయి.
తెలంగాణ కమలదళపతి ఎన్నిక తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా.. రాబోయే ఎన్నికల కోసం కష్టపడి శ్రేణులు పనిచేసేందుకు కావాల్సిన జోష్ నింపేలా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్య నేతలతో దాదాపు గంట పాటు ఆయన భేటీ అవ్వనున్నారు. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుపై ప్రధానంగా చర్చించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అందుకోసం పలువురు నేతలు షాను విడివిడిగా కలిసేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కమలంలో కల్లోలం నెలకొన్న తరుణంలో షా పర్యటనపైనే రాష్ట్ర నాయకత్వం గంపెడాశలు పెట్టుకుంది. షాతో భేటీలో నేతలు పరస్పర ఫిర్యాదులతోనే సరిపెడతారా? లేక తమ తీరును మార్చుకుని సర్దుకుపోతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమస్యలకు షా చెక్ పెడతారా? లేదా? అనేది చూడాలి.
అమిత్ షా షెడ్యూల్ ఖరారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 6న హైదరాబాద్ కు ఆయన రానున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐటీసీ కాకతీయలో లంచ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో గంటపాటు భేటీ అవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 46 సంవత్సరాల ప్రయాణానికి సంబంధించి ఎగ్జిబిషన్ ను షా ప్రారంభించనున్నారు. ఆపై ఎస్ఎస్ బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ కు వర్చువల్ గా షా శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు మొజంజాహీ మార్కెట్ లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Also Read: The Bengal Files: సీఎంకు దర్శకుడు విన్నపం.. చేతులు జోడించినా రాని ఫలితం