తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mana Ooru Mana Badi Scam: కాళేశ్వరం ప్రాజెక్టు కన్న పెద్దస్కాం మనఊరు-మనబడి పథకంలో భాగంగా కొనుగోలు చేసిన బేంచీల్లో అవినీతి జరిగిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ప్రభుత్వం ఆ అవినీతిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 32లక్షల బేంచీలు కొనుగోళ్లు చేశారని, అవి నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టాయిలెట్ల సదుపాయం, తాగునీరు, కరెంటు తదితర సదుపాయాలు లేవన్నారు.
మౌలిక సదుపాయాలు లేకుండా ప్యూచర్ జనరేషన్ ను ఎలా తయారు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం సూపర్ పవర్ గా ఎదగాలంటే ఎలా సాధ్యమని నిలదీశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ముందు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ నిర్మాణం కేవలం ఒక్క ప్రభుత్వం బాధ్యతే కాదని, ఈ దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. కొందరు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారుగానీ డ్యూటీలు మాత్రం సరిగ్గా చేయడం లేదని అన్నారు.
Also Read: SLBC tunnel Collapse Update: టన్నెల్ లో మరో మృతదేహాం లభ్యం.. ఎక్కడ దొరికిందంటే..
తాను మాట్లాడేది వారికి రుచించకపోవచ్చన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూనే మరో దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చాలా పరిశ్రమలున్నాయని, ఆయా సంస్థలు సీఎస్ఆర్లో భాగంగా స్కూళ్లను అడాప్ట్ చేసుకునే విషయంపై ఎవరూ దృష్టి సారించడం లేదన్నారు. 3900 స్కూళ్లలో కేవలం వంద లోపే విద్యార్థులున్నారని, దీనిని సరి చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.1200 స్కూళ్లలో కొత్తగా ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు. విద్యాశాఖలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మైనారిటీ స్కూళ్లను రోస్టర్ నుంచి డీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే ఉర్దూ మీడియం స్కూళ్ల పోస్టులను డీనోటిఫై చేశారన్నారు. ఆయన మృతి తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ విద్య అనేది హక్కు అన్నారు. ఉర్దూ మీడియం స్కూళ్లలో సెకండ్ లాంగ్వేజ్‌గా ఉర్దూ తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. తెలుగు, హిందీలను తీసుకునే అవకాశం ఉన్నా ఉర్దూను మాత్రం చేర్చడం లేదని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను దారుణంగా పెంచుతున్నారని, ఆయా స్కూళ్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమెరికా, బ్రిటన్‌లలోని కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీలకు కొందరు ప్రతినిధులను పంపించి స్టడీ చేయించాలన్నారు. తద్వారా మన దగ్గర కూడా డిగ్రీ విద్యను బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
Also Read: Telangana Cabinet: మంత్రివర్గం లోకి ఆ 5 మంది? రాములమ్మకు ఎంత అదృష్టమో?