దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మే 13వ తేదీన ఇక్కడి 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే ఈసారీ పార్టీలు తమ అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందు ఉంచటానికి బదులు అసత్యాలు, అర్థ సత్యాలు, ఆరోపణలతో ఓటర్లను గందరగోళపరచే ప్రయత్నాన్ని సీరియస్‌గా చేస్తున్నాయి. అయితే, ఓటర్లు మాత్రం అన్ని పార్టీల హామీలను ఆసక్తిగా వింటూ, ఆయా పార్టీల పట్ల తమ అభిప్రాయాన్ని నిశ్చయపరుచుకునే మూడ్‌లో ఉన్నారు. మరో రెండు వారాల్లో పోలింగ్ జరగనున్నందున, అటు పార్టీలూ ఈ కీలక సమయంలోనే ఓటరు అభిమానాన్ని ఓటుగా మార్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రచించి, అమలు చేస్తున్నాయి.
తెలంగాణలో పాలక పక్షంగా ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇచ్చిన 6 ప్రధాన హామీలతో బాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలోని అంశాలను ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ, నిన్నటి దాకా తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలపు వైఫల్యాలను, వాటి మూలంగా తెలంగాణకు కలిగిన నష్టాన్ని ఓటర్ల ముందుంచుతోంది. తాను అధికారంలోకి వస్తే లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి విలువలకు పెద్దపీట వేస్తామని, ఆదినుంచి తమ పార్టీ విశ్వసించే ఉదారవాద ఆర్థిక విధానాలను అమలు చేస్తామని ఆ పార్టీ వాగ్దానం చేస్తోంది.
ఈ ఎన్నికల్లో మరో ప్రధాన పక్షమైన బీజేపీ అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలతో బాటు మోదీ పాలనలో దేశానికి వచ్చిన గుర్తింపును, విదేశాంగ శాఖ విజయాలతో బాటు బలమైన జాతీయవాద భావనలతో మెజారిటీ హిందూ ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు గట్టిగా కృషి చేస్తోంది. తెలంగాణలో ఆ పార్టీ ఎన్నడూ అధికారంలో లేనందున ఇక్కడ ఆ పార్టీకి చెప్పుకునేందుకు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేవు. దీంతో కేంద్ర పథకాలు, మోదీ చరిష్మా మీదనే ఆధారపడి ముందుకు సాగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో తాను సాధించిన 4 సీట్లకు మరిన్ని జోడించగలిగితే, బీఆర్ఎస్ స్థానంలో తాను విపక్ష పాత్ర పోషించవచ్చనీ, ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారానికి దగ్గర చేస్తుందని భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ పోటీ చేసే స్థానాలలో సగం సీట్లలో.. పార్టీ గొప్పదనం, సైద్ధాంతికత కంటే అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థుల ఇమేజ్ మీదనే ఎక్కువగా ఆధారపడింది.
Also Read: 23 సంవత్సరాలు..23 తప్పులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై, విపక్షానికి పరిమితమై, ఈ మూడు నెలల కాలంలో తన నేతలంతా అధికార పక్షంలోకి వలస పోతుంటే విలవిలలాడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తన ఉనికి నిలబడితే చాలనే ప్రయత్నంలో ఉంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ఏడాది నాడు కోతలు కోసిన ఆ పార్టీ అధినేత కూతురు కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత పార్టీ ఉనికిని నిలుపుకుంటే చాలని భావిస్తున్నారు. కుమార్తెను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ అధినేత కేంద్ర పెద్దలతో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారనీ, ఈ క్రమంలోనే కొన్ని స్థానాలను వారికి అప్పగించటానికే ఆయా సీట్లలో బలహీనమైన అభ్యర్థులను నిలిపారనే వార్తలూ బలంగా వినిపిస్తున్నాయి. తన పార్టీ రాజకీయ ఉనికిని నిలుపుకునే క్రమంలో ఆయన ఆయా సీట్లలో బీసీ అభ్యర్థులను బలిచేయబోతున్నారనే వదంతులు ఆ పార్టీలోని బీసీ నేతలను కలవరపెడుతోంది. మరోవైపు ఢిల్లీలో, గల్లీలో లేని ఆ పార్టీకి ఓటెందుకు వేయాలని కొందరు తెలంగాణ ఉద్యమకారులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
సాధరణంగా లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి అంశాలు, సమస్యలు ప్రధానంగా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉంటాయి. కానీ, ఈసారి ఇక్కడ బరిలో ఉన్న అధికార కాంగ్రెస్,బీజేపీ పార్టీలు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను, ఆ కాలంలో జరిగిన తెరచాటు వ్యవహారాలను, ఆ పార్టీ నేతల నియంతృత్వ ధోరణులను తమ ప్రచారంలో తీవ్రంగా ఎండగట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 సీట్లలో 13, 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో 9 మంది లోక్‌సభ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపించారు. కానీ, ఈ సభ్యులెవరూ తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తేలేకపోయారు. వారిలో మెజారిటీ సభ్యులు తమ సొంత వ్యాపారాలను కాపాడుకోవటానికి, తమ వ్యక్తిగత ప్రతిష్టను నిలుపుకునేందుకు మాత్రమే ప్రయత్నించారు. ఏనాడూ పార్లమెంటులో తెలంగాణ సమస్యల గురించి అర్థవంతమైన చర్చ చేసి, దేశం దృష్టికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వీరు తీసుకురాలేకపోయారు. వారంతా తమ సంపదను పెంచుకునేందుకు తప్ప ప్రజల సమస్యల గురించి ఆలోచించలేదనే నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ, ఎంపీలుగా పనిచేసిన కొందరు నేతలు ఇన్నాళ్లూ సర్దుకుపోయే ధోరణిని అవలంబించి, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత ఇక చాలనుకుని కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరిపోయారు. వీరిలో ఏడేనిమిది మంది ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మారి కేసీఆర్‌ను, ఆయన గత పాలనను ఏకిపారేస్తున్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఒకసారి గుర్తుచేసుకుంటే అనేక చేదు జ్ఞాపకాలు గుర్తురాకమానవు. తెలంగాణలోని సహజ వనరులు కార్పొరేట్ సంస్థలకు, బీఆర్ఎస్ అధినేత అనుయాయులకు, ఆయన సొంత సామాజిక వర్గపు పెద్దలకు కట్టబెట్టబడ్డాయి. నాటి అధికార పార్టీ నేతలు కొందరు నిరుపేదల భూములను నిలువునా కబ్జా చేయటం, ధరణి పేరుతో రాత్రికి రాత్రే భూరికార్డులను బదిలీ చేయటం జరిగాయి. పదేళ్ల పాలనలో ప్రశ్నించే గొంతులను అణిచివేయటం, పాలకుల వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా పథకాల రూపకల్పన, రాష్ట్ర ఖజానాలోని నిధులను దుర్వినియోగం చేయటం, జవాబుదారీతనం లేకపోవటం, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా భావించి హేతుబద్ధత లేని పథకాలను ప్రకటించటం జరిగాయి. ఈ క్రమంలో మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు ఏడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పును మోయాల్సిన దుస్థితి దాపురించింది. తన పాలనలో ఏనాడూ సామాన్యుడికి అందుబాటులో లేని కేసీఆర్ ప్రజల సొమ్ముతో కట్టిన సీఎం అధికార నివాసానికి ఎవరూ రాకుండా ఇనుప కంచెలు నిర్మించటం ప్రజాస్వామిక వాదులను ఆగ్రహావేశాలకు లోనుచేసింది. నేడు ఆయనే తిరిగి తన రాజకీయ భవితవ్యం కోసం, కూతురు కవితను జైలు నుంచి కాపాడేందుకు బస్సు యాత్రల పేరిట తమ ముందుకు వస్తుంటే జనం కనీస స్థాయిలో స్పందించటం లేదు. కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కొక్క కుమారుడూ నేలకూలుతుంటే చేష్టలుడిగిపోయిన దృతరాష్ట్రుడి మాదిరిగా ఉంది నేటి కేసీఆర్ దుస్థితి.
Also Read: రూట్ మార్చిన కేసీఆర్.. అంతలోనే ఇంత మార్పా?
అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నేడు కేసీఆర్ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. ఆయన నీడ ఉండి, ఆర్థికంగా బలపడిన చాలామంది ఒక్కొక్కరుగా వలస పక్షులై ఎగిరిపోతున్నారు. దుబాయి పంపుతానంటూ ఒకనాడు అనేక మంది నిరుపేదలను నిలువునా ముంచిన ఈ గల్ఫ్ ఏజెంటు.. తర్వాతి రోజుల్లో రాజకీయ నాయకుడిగా మారాడు. తెలంగాణ పేరుతో ప్రజలను రెచ్చగొట్టి సొంత పార్టీ పెట్టుకుని, కవులు, కళాకారులు, అధ్యాపకులు, మేధావులు, యువత, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలకు ఆశల స్వప్నాలను చూపించారు. నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మొదలు జాతీయ పార్టీల నేతలు ఈయన మోసపూరిత ధోరణికి బలైనవారే. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమపార్టీని ఫక్తు కుటుంబ పార్టీగా మార్చి తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారు. దళితుడికి సీఎం పదవి, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ, అమరవీరులకిచ్చిన హామీలు, ముస్లింలకు రిజర్వేషన్ల వంటి ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. పైగా అప్పటివరకు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేశారు. ఆయన నాటి పాపాలకు బీఆర్ఎస్ పార్టీ బలైపోయింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఓటమి పాలైన మూడు నెలల్లో ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటం చరిత్రలో లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి గుండు సున్నా ఇవ్వటానికి తెలంగాణ సమాజం ఇప్పటికే మానసికంగా సిద్ధమైందని, ఆ పార్టీకి 20% ఓట్లకు మించి వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రొ. కూరపాటి వెంకటనారాయణ (కాకతీయ విశ్వవిద్యాలయం)