Telangana Elections: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలల తమ పాలనే రెఫరెండంగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు తప్పకుండా ప్రజల మద్దతు ఉంటుందని విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇదే తరహా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పారు.
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో ఆయన స్వంతంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ మూడవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హాజరైయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యే లు విజయరమణ రావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, అడ్డురి లక్ష్మణ్ కుమార్, గండ్ర సత్యనారాయణరావు పాల్గోన్నారు. హైదరాబాద్ నుండి నేరుగా ప్రత్యేక వాహనాలతో ధన్వాడకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు, మంత్రి, ఎంఎల్ఏలకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం, మంత్రి ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధన్వాడలోని మంత్రి శ్రీధర్ బాబు ఇంటి వద్ద మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
Also Read: పాము పక్కనుంటే చంపుతాం.. లింగం మీదుంటే మొక్కుతాం: బీజేపీకి క్లాస్
ధన్వాడలోని దత్తాత్రేయస్వామిని దర్శించుకోవడంతో తన జన్మ ధన్యమైందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయాన్ని ఆకాంక్షించి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుకుంటున్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. రాష్ట్రంలో సుమారు 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డాడు. రాహుల్ గాంధీ చేసిన బస్సుయాత్ర, పాదయాత్రతో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. రాహుల్ పోరాటాల ఫలితాలు, కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి విజయం సాధిస్తుంది అన్నారు. కొన్ని పార్టీలు అన్ని భావజాలాలను పక్కనపెట్టి ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చూశాయని, ప్రజలు మాత్రం ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని పేర్కొన్నారు.