– బీఆర్ఎస్ చచ్చిన పాము
– త్వరలో కూటమిలో కానీ, కాంగ్రెస్‌లో కానీ విలీనం ఖాయం
– హస్తాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు
– ఉచితాల పేరుతో భ్రమలు కల్పిస్తోంది
– కూటమికి ప్రతిపక్ష హోదా కూడా డౌటే
– జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న లక్ష్మణ్
Congress: తెలంగాణ అప్పులకుప్పగా మారుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సరళి చూస్తుంటే బీజేపీ అన్ని స్థానాల్లో ముందంజలో ఉందని అనిపిస్తోందని చెప్పారు. మిగితా పార్టీల కంటే మెజార్టీ స్థానాలు సాధిస్తామని అనుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ 370 స్థానాలు, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితులు లేవన్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు తెచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని విమర్శించారు. కాళేశ్వరం, ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన, బీఆర్ఎస్‌ను చచ్చిన పాముతో పోల్చారు. కారు గ్యారేజీ నుంచి బయటకొచ్చినా పనికిరాదన్నారు. ఒక్క సీటు కాదు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. కవిత నిర్వాకం వల్ల బీఆర్ఎస్ అధోగతి పాలయ్యిందన్న లక్ష్మణ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు లెక్కచేయకుండా ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డారని చెప్పారు.
Also Read: Bhatti: నో డౌట్.. 14 సీట్లు కాంగ్రెస్‌వే
కేసీఆర్ తన పార్టీని కూటమిలో కానీ, కాంగ్రెస్‌లో కానీ విలీనం చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమిని నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరని, దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ అప్పుల ఊబిలో పడిపోయే ప్రమాదం ఉందని, ఉచితాల పేరుతో ప్రజలకు భ్రమలు కల్పించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో కాంగ్రెస్ పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, వ్యతిరేకతే కాదు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.