Wednesday, September 18, 2024

Exclusive

BJP Party: ఆ గట్టునుంటే దొంగ, ఇటు చేరితే దొర ఇదే బీజేపీ మంత్రం..

బీజేపీని ఎదిరిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ వేధింపులు ..
– ఈడీ, సీబీఐలను జేబు సంస్థలుగా మార్చిన కేంద్రం
– వందలో 95% కేసులు విపక్ష నేతలపైనే
– పదేళ్లలో నేరం రుజువైన కేసులు 0.42%
– కండువా కప్పుకుంటే సోదాలు, విచారణలు బంద్‌
– ఎన్నికలయ్యే రాష్ర్టాల్లో దాడులతో హడావుడి..
– రాజకీయ లబ్ధికి విచారణ సంస్థల దుర్వినియోగం
– జేబు సంస్థలుగా మార్చేసిన బీజేపీ అధిష్ఠానం
– విపక్ష నేతలే టార్గెట్‌, లొంగితే బారాఖూన్‌ మాఫ్‌

BJP party news in telugu(Politics news today India): ఏ మరకనైనా మాయం చేసే విచిత్ర రాజకీయం దేశంలో నడుస్తోంది. నచ్చని విపక్ష నేతలకు బురదపూసేదీ, వాళ్లు భయపడి తమ పార్టీలో చేరితే క్లీన్ చిట్ ఇచ్చేదీ వారే. ఎన్ని పాపపు పనులు చేసినా కమల తీర్థం పుచ్చుకుంటే చాలు.. పరమపవిత్రులైపోతారు. బీజేపీ అనే గంగానదిలో ఒక్క మునక వేస్తే చాలు.. ఎంత దుష్ట చరిత్ర ఉన్నా సచ్చీలులై గర్వంగా నిలబడతారు. కండువా కప్పుకుంటే చాలు.. అప్పటి దాకా పొడచే వేలు.. కన్నీరు తుడిచి, వెన్ను తట్టే అభయహస్తం అయిపోతుంది. ఆపై.. అప్పటిదాకా ఊపిరి సలపకుండా వేధించిన ఈడీ, సీబీఐ, ఐటీ బృందాల వేట కూడా ఆగిపోతుంది. ‘అంతా బాగుంది’ అంటూ ఆయా ఏజెన్సీలు క్లీన్ చిట్ ఇచ్చేస్తాయి. ఎంతటి కళంకితుడైనా కమలనాథులకు జై కొడితే చాలు.. కడిగిన ముత్యమైపోతాడు. 2014 నుంచి ఎన్నో రాష్ర్టాల్లో ఎందరో అవినీతి నేతలు.. బీజేపీ అనే గంగానదిలో స్నానం చేయగానే జననేతలూ అయ్యారు. ఒక సిద్ధాంతం అవసరం లేదు. ఒక విధానంతోనూ పనిలేదు. ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసిన ఎవరినైనా ఆరోపణల పేరుతో అగాథంలోకి తోయటం, అక్కున చేరితే అభయహస్తం ఇవ్వడం నేడు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. సీబీఐ, ఈడీ, ఐటీలను జేబుసంస్థలుగా మార్చుకొని చేస్తున్న ఈ బీజేపీ క్షుద్ర రాజకీయం.. ఇప్పటిదాకా బాగానే సాగింది గానీ, ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనిని ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయి. ప్రశ్నించే స్వభావం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ధైర్యంగా నిలబడిన నేతలున్న చోట ఇది పారని పాచికగానే మిగిలిపోతోంది.

‘మా దగ్గర గుజరాత్‌లో తయారయ్యే వాషింగ్‌పౌడర్‌ను వాడే వాషింగ్‌ మెషిన్‌ ఉంది. ఆ మెషిన్ ముందు విపక్షనేతలను క్లీన్‌ చేసి, ఆ తర్వాత వారిని అక్కున చేర్చుకుంటుంది’ అని 2019లో నాటి రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ దానవే అన్నారు. మనం పైన చెప్పుకున్న మాటలన్నీ ఆయన రెండే మాటల్లో తేల్చిపారేశారు. నిజానికి ఆయన ఈ మాట 2019లో అన్నప్పటికీ, 2014 నుంచే బీజేపీ ఈ వాషింగ్ మెషిన్‌ ఫార్ములాను వాడుతోంది. కాకపోతే, అప్పట్లో ‘మోదీ ఏం చేసినా దేశం కోసమే’ అనే భ్రమ బలంగా ఉండటం వల్ల జనం పట్టించుకోలేదు గానీ, ఈ పదేళ్లలో బీజేపీ ఆ వాషింగ్ మెషిన్‌ను వాడుతున్న తీరు చూశాక.. ప్రజలకు కొంచెం కొంచెంగా ‘ఎక్కడో తేడా కొడుతుందే’ అనిపిస్తోంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల నాటికి జనానికి ఈ వాషింగ్ మెషిన్ ఫార్ములా మొత్తం క్లియర్‌గా అర్థమైపోతోంది.

ఇదీ యాక్షన్ ప్లాన్

ముందుగా ఒక ఆరోపణ చేయటం, ఆపై తనిఖీలకు దిగటం, ఆశ్చర్యపోయే నాటకీయ పరిణామాల మధ్య కేసులో ఒక నిందితుడు అప్రూవర్‌గా మారటం లేదా గతంలో చెప్పిన దానికి భిన్నంగా కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వటం రోజుల వ్యవధిలో జరుగుతుంది. దీంతో వెంటనే దర్యాప్తు సంస్థలు అప్రూవర్ స్టేట్‌మెంట్‌ను బట్టి మరికొందరిని నిందితులుగా మారుస్తారు. ఈ వెంటనే మీడియాలో వారు దోషులే అన్నట్లుగా రోజుకో రీతిలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలోనైతే వారి వ్యక్తిగత జీవితాలూ చర్చకు వస్తాయి. ఈ క్రమంలో సత్యం మరుగున పడుతుంది. అరెస్టయిన నేతలు, వారి కుటుంబాలు మనోధైర్యం కోల్పోతాయి. జైల్లో గడపాల్సి రావటం, కోర్టు ముందు/ సమాజం ముందు తలదించుకోవాల్సి రావటం, రాజీకీయంగా/ వ్యాపారపరంగా నష్టపోవాల్సి రావటం, వ్యక్తిగత క్షోభకు లోనుకావటం జరుగుతుంది. అదే సమయంలో మరో టీం కుటుంబసభ్యులను, శ్రేయోభిలాషులను, బంధువులను కలిసి పార్టీలో చేరే వాతావరణాన్ని కల్పిస్తుంది. మనసు చంపుకుని పార్టీ కండువా కప్పుకుంటే సరి. లేకుంటే కోర్టుల చుట్టూ తిరగటమే.

ఎన్నికల ముందుగా..

ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాదిలో ఉన్నాయనగా కేంద్రం నుంచి విచారణ సంస్థలు ఆ రాష్ట్రంలో హటాత్తుగా ఊడిపడతాయి. బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న సదరు నేతల ఇళ్లలో చొరబడి తనిఖీలు నిర్వహిస్తాయి. మహారాష్ట్రలో 2019 ఎన్నికలకుముందు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌పై ఈడీ దాడులు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అధినేత స్టాలిన్‌ కూతురు ఇంటిపై ఐటీ దాడులు, బెంగాల్‌ ఎన్నికల వేళ మమతాబెనర్జీ సన్నిహితుడు పార్థ చటర్జీకి సీబీఐ నోటీసులు, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, అతడి భార్యకు ఈడీ సమన్లు ఇవ్వటం, 2017 కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు చెందిన 70 ప్రాంతాల్లో జరిగిన ఐటీ దాడులు, 2018 ఎన్నికల్లో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సోదరుడు అగ్రసేన్‌ గెహ్లాట్‌, ఆయన సన్నిహితులపై సీబీఐ, ఈడీ దాడులు, గత మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు కమల్ నాథ్, భూపేష్‌ భగేల్‌పై సీబీఐ, ఈడీ దాడులు కేరళ ఎన్నికల వేళ సీఎం పినరయి విజయన్‌ను ఇరికించేందుకు గోల్డ్‌ స్కాం నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ తెరపైకి తేవటం, తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టు, ప్రస్తుతం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుల వరకు అన్నీ అదే కేటగిరీకి చెందినవి.

వాషింగ్ మెషీన్‌లో శుభ్రపడిన నేతలు

నారాయణ్‌ రాణె: మనీలాండరింగ్‌ కేసులో ఈడీ కేసులు పెట్టింది. 2017లో బీజేపీకి అనుబంధంగా సొంత పార్టీ పెట్టుకోవడంతో దాడులు నెమ్మదించటం, ఆనక తన పార్టీని బీజేపీలో విలీనంతో దాడులు బంద్.
సువేందు అధికారి: శారద స్కామ్ కేసులో 2014 నుంచి పలుమార్లు సీబీఐ ప్రశ్నించిన ఈ పశ్చిమబెంగాల్‌ టీఎంసీ సీనియర్ నేత 2020లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోగానే, విచారణ ఆగిపోవటమే గాక బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థి స్థాయికి ఎదిగారు.
హిమంత బిశ్వశర్మ: అసోం కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత కూడా శారదా కుంభకోణంలో నిందితుడే. 2014 నవంబర్‌లో ఈయన ఇంటిలో సీబీఐ సోదాలు చేయగా, 2015 ఆగస్టులో బీజేపీలో చేరి, ఏకంగా అసోం సీఎం అయ్యారు.
ముకుల్‌ రాయ్‌: 2014లో బెంగాల్‌లో ముడుపుల కేసులో బయటికొచ్చిన ఈ నేత కూడా శారద కేసులో నిందితుడే. వరుస సీబీఐ నోటీసులకు భయపడి 2017లో బీజేపీలో చేరారు. వెంటనే విచారణ ఆగటం, 2021 మేలో క్లీన్‌ చిట్‌ రావటం జరిగాయి.
జ్యోతిరాదిత్య సింధియా: ఈ కాంగ్రెస్‌ నేతపై మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారు భూ కబ్జా ఆరోపణలు రావటం, 2020 మార్చి 10న ఆయన బీజేపీలో చేరగానే మధ్యప్రదేశ్‌ ఎకనామిక్స్‌ అఫెన్స్‌ వింగ్‌ ఆ కేసును మూసేయటం జరిగింది.

భావనా గవాలీ: మహారాష్ట్రలో ఠాక్రే శివసేనలో ఉన్నప్పుడు ఆమెకు ఈడీ ఐదుసార్లు నోటీసులిచ్చింది. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరి ఎంపీ కాగానే, ఈడీ కేసులు మరుగునపడ్డాయి.
యశ్వంత్‌ జాదవ్‌: షిండే వర్గంలోకి జంప్ చేయగానే యశ్వంత్‌ జాదవ్‌, ఆయన సతీమణి యామినీ జాదవ్‌పై ఫెమా ఉల్లంఘనల కింద ఈడీ పెట్టిన కేసులు అటకెక్కాయి.
ప్రతాప్‌ సర్నాయక్‌: శివసేనలో ఉన్నప్పుడు ఈడీ మనీలాండరింగ్‌ కేసు పెట్టగా, షిండే సేనలోకి వెళ్లగానే కేసు ఊసే లేకుండా పోయింది.
సుజనా చౌదరి, సీఎం రమేష్, కొత్తపల్లి గీత, కావూరి సాంబశివరావు: టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, సీఎం రమేష్ మీద 2018లో దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయి. వీరు బీజేపీలో చేరగానే అవి ఆగిపోయాయి. తాజాగా ఏపీలో బీజేపీ నుంచి ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కింది.
కావూరి సాంబశివరావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత: ఈ ఇద్దరు నేతలూ ఈ ఫార్ములాను పాటించి బయటపడ్డారు. వీరిలో గీతకు తాజాగా బీజేపీ టికెట్ కూడా దక్కింది.
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, సీనియర్ నేత గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్‌ మీద ఉన్న ఈడీ, సిబిఐ కేసులు అన్నీ పార్టీ కండువా కప్పుకోగానే క్లియర్ అయిపోయాయి.
హార్థిక్ పటేల్: దేశ ద్రోహం కేసు మోపబడిన గుజరాత్ నేత హార్దిక్ పటేల్ కూడా బీజేపీలో చేరి సేఫ్‌గా బయటపడ్డారు.

గణాంకాలే సాక్ష్యం

2004-14 కాలంలో సీబీఐ 72 మంది నాయకులపై దర్యాప్తు చేస్తే.. వారిలో 43 మంది మాత్రమే ప్రతిపక్షాల నేతలు.(60%). 2014 – 2024 మధ్య కాలంలో సీబీఐ పెట్టిన కేసులు 124 కాగా, వాటిలో విపక్ష నేతల మీద పెట్టినవి 118. (95%)
2004 – 2014 వరకు 112 ఈడీ కేసులు నమోదు అయితే 2014 నుంచి 2024 నాటికి 5906కి పెరిగాయి. 2014కి ముందు ఈడీ దర్యాప్తు కేసులు 53 %. నేడు అవి 95 %.
ఈడీ, సీబీఐ ఫైల్‌ చేసిన మొత్తం కేసుల్లో విపక్షనేతలపై ఫైల్ అయిన కేసులు 95% కాగా, వాటిలో నేర నిరూపణ జరిగి శిక్షపడిన వారు 0.42 %. ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసులు 99.54%.

ప్రజాస్వామ్యం అనేది కొన్ని నియమాలకు కట్టుబడి ఆడే ఆట వంటిది. ఇందులో ఎన్నికలు భాగమే తప్ప ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదని మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. కానీ, అధికారమే పరమావధిగా పనిచేస్తున్న బీజేపీ దర్యాప్తు సంస్థలను చేతిలో పెట్టుకుని ఆడుతున్న ఆట అరాచకాలకు దారితీయటం దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ తొండాటను దేశ ప్రజలు తమ ఓటు ఆయుధంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో వాడేందుకు సిద్ధపడే వాతావరణమూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రజల చైతన్యమే మన ఈ క్షుద్ర క్రీడకు చెక్ పెట్టగలదు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...