World Mental Health Day 2025: ప్రస్తుత పోటీ ప్రపంచంలో దాదాపుగా ప్రతీ ఒక్కరూ తీవ్ర ఒత్తిడితో జీవిస్తున్నారు. ఏదోక రూపంలో మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. భార్య, భర్తల దాంపత్యం పైనా ఈ మానసిక ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బయటకు సక్సెస్ ఫుల్ కపుల్ గా కనిపించేవారు సైతం.. నిజ జీవితంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. కాగా, నేడు (అక్టోబర్ 10) ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. కాబట్టి ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు? దాని నుంచి బయటపడే మార్గాలు? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
డిప్రెషన్ వల్ల వచ్చే సమస్యలు
ఒత్తిడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో కామన్ గా కొన్ని రుగ్మతలు కనిపిస్తున్నాయి. ఆడ, మగ, చిన్న, పెద్ద, వయసు వంటి తారతమ్యాలు లేకుండా చాలా మందిని ఆ సమస్యలు వెంటాడుతున్నారు. నిత్యం ఒత్తిడికి గురయ్యే వారిలో నిరుత్సాహం (Depression), అనవసరమైన ఆందోళనలు (Anxiety Disorders), బైపోలార్ రుగ్మత (Bipolar Disorder), స్కిజోఫ్రేనియా (Schizophrenia) వంటి సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఏటా 7లక్షల మంది ఆత్మహత్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. భూమిపై 1 బిలియన్ మందికి పైగా ప్రజలు నిరుత్సాహం, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్నారు. దీని కారణంగా వారు తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఒత్తిడి కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో పాటు ఆర్థిక నష్టం కూడా కలుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక (WHO Report) తెలిపింది. అయితే ప్రజల్లో నానాటికి పెరిగిపోతున్న మానసిక ఆందోళనలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం లేదని డబ్ల్యూహెచ్ఓ వాపోయింది. ప్రతీ దేశం తమ ఆరోగ్య బడ్జెట్ లో కేవలం 2% మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. కాగా ప్రతీ ఏటా 7 లక్షల మంది డెప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న పేర్కొంది. పురుషుల్లో ఈ సూసైడ్ రేట్ అధికంగా ఉన్నట్లు తెలిపింది.
ఒత్తిడి నుంచి ఇలా బయటపడండి!
మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. శరీరాన్ని ఎప్పుడూ చురుగ్గా ఉంచడం కోసం రోజూ తప్పనిసరిగా వ్యాయమం చేయాలని పేర్కొంటున్నారు. అలాగే మిత్రులు, కుటుంబ సభ్యులతో సానుకూల బంధాలను ఏర్పరచుకోవాలని.. నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటున్నారు. మెదడును ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. మరీ ఒత్తిడిగా అనిపిస్తే కౌన్సిలింగ్ కు వెళ్లాలని.. థెరపి లేదా మందులు వాడాలని హితవు పలుకుతున్నారు. మద్యం, సిగరేట్ వంటి వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Gutka Stains In Metro: కొత్తగా మెట్రో సేవలు లాంచ్.. 3 రోజులకే గుట్కా మరకలతో.. అధ్వాన్నంగా మారిన స్టేషన్
మరికొన్ని చిట్కాలు..
నిపుణులు చెప్పిన సూచనలను పాటించడంతో పాటు కొన్ని స్వీయ రంక్షణ చర్యలతోనూ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ప్రతీ రోజూ ధ్యానం చేయడం మీలోని డిప్రెషన్ ను అమాంతం దూరం చేస్తుంది. పని వేళ్లలో కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. కాన్ఫిడెంట్ గా ఉండే వ్యక్తులతో స్నేహాన్ని పెంచుకొని.. వారితో రోజూ మాట్లడటానికి ట్రై చేయండి. ఏదోక క్రీడను హాబీగా ఎంచుకొని దానికోసం రోజులో గంట సమయాన్ని కేటాయించండి. సోషల్ మీడియాకు బదులు.. ప్రకృతిలో సమయాన్ని గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా డిప్రెషన్ ను దరిచేరనీయకుండా కట్టడి చేయవచ్చు.
