Wolf Supermoon: కొత్త ఏడాదిలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. వుల్ఫ్ సూపర్ మూన్ నింగిలో కనువిందు చేయనుంది. సాధారణంగా కొత్త ఏడాదిలో వచ్చే తొలి పౌర్ణమిని.. ఉల్ఫ్ సూపర్ మూన్ గా పిలుస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జనవరి 3న ఈ ఉల్ఫ్ సూపర్ మూన్ దర్శనమివ్వనుంది. ఆ రోజున చంద్రుడు సాధారణ రోజులతో పోలిస్తే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతేకాదు ఇతర పౌర్ణమి రోజుల్లో కంటే పెద్దగా ఉండి వెలుగులు విరజిమ్ముతుంటాడు.
వుల్ఫ్ మూన్ పేరు ఎలా వచ్చింది?
వుల్ఫ్ మూన్ అనే పేరు ఉత్తర అమెరికాలోని జానపద కథల నుంచి ఆవిర్భవించింది. జనవరిలో అక్కడ మంచు కురుస్తుండటంతో పాటు తీవ్రమైన చలి, చీకటి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తోడేళ్లు అధికంగా కేకలు వేస్తుంటాయని ప్రజలు చెబుతుంటారు. ఇలాంటి కాలంలో వచ్చే పౌర్ణమిని.. వారు వుల్ఫ్ మూన్ గా పేరు పెట్టుకున్నారు. ఈ ఏడాది రాబోయే వుల్ఫ్ మూన్ మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుండటంతో దీనిని ‘వుల్ఫ్ సూపర్ మూన్’ అని పిలుస్తున్నారు.
ఎప్పుడు చూడాలి?
సూర్యస్తమయం తర్వాత చంద్రుడు ఉదయిస్తున్నట్లుగా కనిపించే వేళలో ఈ వుల్ఫ్ మూన్ ను వీక్షించవచ్చు. ఈ వుల్ఫ్ మూన్ అమెరికాలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. న్యూయార్క్ లో 4:56 గంటలకు (IST), లాస్ ఏంజెలెస్ లో 5.25 గంటలకు వుల్ఫ్ మూన్ చూడవచ్చు. ఆ సమయంలో చంద్రుడి కాంతి చాలా స్పష్టంగా ఉండటంతో పాటు అద్భుతమైన అనుభవాన్ని పంచుతుంది. బైనాక్యులర్ సాయంతో చంద్రుడి ఉపరితలాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు.
Also Read: New Year 2026 Hyderabad: న్యూయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!
మరికొన్ని ఆకాశ అద్భుతాలు
వుల్ఫ్ మూన్ తర్వాత సుమారు వారం రోజులకు అంటే జనవరి 10న గురుగ్రహం (జూపిటర్) ‘ఆపోజిషన్’ దశకు చేరుకుంటుంది. ఆ రోజు ఇది సూర్యాస్తమయానికి ఉదయించి సూర్యోదయానికి అస్తమిస్తుంది. ఏడాదిలోనే అత్యంత ప్రకాశవంతంగా గురుగ్రహం కనిపించే రోజు అదే కావడంతో బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోపులతో వీక్షించేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్. కాగా ఈ ఏడాదిలో మెుత్తం 13 పౌర్ణమిలు రానున్నాయి. వుల్ఫ్ మూన్ తర్వాత ఫిబ్రవరి 1న స్నో మూన్ రానుంది. దాని తర్వాత ఒక బ్లూ మూన్, 3 సూపర్ మూన్స్, 2 చంద్ర గ్రహణాలు ఆకాంశంలో సంభవించనున్నాయి.

