శ్రీనగర్, స్వేచ్ఛ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌పై ప్రతిష్టాత్మక ‘వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ ట్రైన్’ రయ్ రయ్.. మంటూ పరుగులు పెట్టింది. శనివారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. జమ్మూ కశ్మీర్‌తో రైలు కనెక్టివిటీకి ఊతమిచ్చే ఈ మార్గంలో వందేభారత్ రైలు పరుగులు పెట్టడం ఇదే మొట్టమొదటిసారి. శ్రీ మాతావైష్ణోదేవీ కాత్రా (ఎస్‌వీడీకే) నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వరకు రైలు ప్రయాణించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌గా గుర్తింపు పొందిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)పై వందేభారత్ రైలు పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలోనే తొలి కేబుల్-స్టేయిడ్ బ్రిడ్జ్ అంజి ఖాద్ బ్రిడ్జ్ (Anji Khad Bridge) గుండా కూడా ఈ రైలు పరుగులు పెట్టింది. జమ్మూలో ఉదయం 11.30 గంటల సమయానికి రైలు చేరుకోగా ఇండియన్ రైల్వేస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బుద్గామ్ స్టేషన్ చేరుకోవడంతో ట్రయల్ రన్ పూర్తయింది. కమర్షియల్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా పచ్చజెండా ఊపనున్నారు. వందే భారత్ (Vande Bharat) రైలు ప్రారంభ తేదీని ఇండియన్ రైల్వేస్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ రైలుని ఇంజనీర్లు ప్రత్యేకంగా రూపొందించారు.
జమ్మూ, కశ్మీర్ మధ్య అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. విపరీతమైన చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సదుపాయాలతో తయారు చేశారు. శీతల వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా నిరంతరం రైలు ప్రయాణించగలిగేలా అత్యాధునిక పద్ధతుల్లో సిద్ధం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లతో పోల్చితే ఈ రైలులో అనేక అదనపు సదుపాయాలు ఉన్నాయి.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పలు సౌలభ్యాలను కల్పించారు. నీళ్లు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ సిస్టమ్, బయో-టాయిలెట్ ట్యాంక్స్, వ్యాక్యూమ్ సిస్టమ్ కోసం వేడి గాలితో పాటు పూర్తిగా ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్‌గా తెరచుకునే డోర్లు, మొబైల్ ఛార్జింగ్ సాకేట్లు ఉన్నాయి. 272 కిలోమీటర్ల పొడవైన ఉద్దమ్‌పూర్-శ్రీనగర్ – బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ వందే భారత్ (Vande Bharat) రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చీనాబ్ బ్రిడ్జ్ నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును చీనాబ్ బ్రిడ్జ్ బద్దలుకొట్టింది.