Telangana 10 years formation day Sonia gandhi Modi tweets:
అనేకమంది అమరుల త్యాగాలతో ఉద్యమ స్ఫూర్తిగా నిలచింది తెలంగాణ ఉద్యమం. దేశ రాజధానిలోనూ సంచలనం క్రియేట్ చేసింది తెలంగాణ మలిదశ ఉద్యమం. అయితే ఉమ్మడి భవన్ విభజనను కేసీఆర్ పదేండ్లు నాన్చితే.. సీఎం రేవంత్ రెడ్డి 15 రోజుల్లో తేల్చేశారు. రాష్ట్ర నిర్ణయాన్ని స్పష్టంగా తెలిపి ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకాన్ని ముగించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వాన్ని, కేంద్ర హోం శాఖను ఒప్పించారు. దీంతో తెలంగాణకు పటౌడీ హౌస్ లో ఐదున్నర, శబరి బ్లాక్ వైపు 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. పటౌడీ హౌస్ లోని ఐదున్నర ఎకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్ నిర్మించనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ కు సీఎం రేవంత్ భూమిపూజ చేస్తారని ఆయన తెలిపారు. ఇక పదేళ్ల తెలంగాణ ఆవిర్భవాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే సోనియా గాంధీని ఆవిర్భావ వేడుకలకు రావలసిందని సీఎం రేవంత్ రె్డ్డి ఆహ్వానించారు.
తెలంగాణ బాధ్యత మాది: సోనియాగాంధీ
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అనారోగ్య కారణాల కారణంగా సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు వీడియో సందేశాన్ని తెలంగాణ ప్రజలకు పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్టేట్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి తెలిపారు. ఆనాడు అధికారంలో ఉన్న తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించారన్నారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. అమర వీరుల కలలను నెరవేర్చాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కారు అమలు చేస్తుందని ఆశిస్తున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధికి కట్టబడి ఉన్నాం: నరేంద్ర మోదీ
తెలంగాణ ఆవతరణ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో స్పెషల్ ట్వీట్ చేశారు. తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని కొనియాడారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు అన్నారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.