Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల నిర్లక్ష్యమే ప్రైవేటు ఆసుపత్రులకు ఆవకాశాలుగా మారాయిని అసహనం వ్యక్తం చేసింది. వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు భారీగా దండుకుంటున్నాయన్న పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రజాప్రయోజన వ్యాజ్యం
రోగులు, వారి బంధువులు అధిక ధరలకు మందులు కొనుగోలు చేసేలా ప్రైవేటు ఆస్పత్రులు బలవంతం చేస్తున్నాయని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమ ఫార్మసీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసేలా బలవంతం చేయకుండా ఆస్పత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఔషధ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విఫలమయ్యాయని మండిపడింది. తమ ఫార్మసీలోనే కొనాలని ఒత్తిడి చేస్తున్న ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని సూచించింది. పౌరులు ఈ రకమైన దోపిడికీ గురికాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని సైతం ఆదేశించింది.
Also Read: Abandoned Car: కుంభమేళా పార్కింగ్ ఏరియాలో మిస్టరీగా తెలంగాణ కారు
గతంలోనే నోటీసులు జారీ
ఔషధ ధరల అంశంపై సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సామాన్యులకు గుదిబండలా మారుతున్న ఔషధ ధరలపై రాష్ట్రాల వైఖరిని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాలకు ధర్మాసనం గతంలో నోటీసులు పంపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన ఆయా రాష్ట్రాలు.. ఔషధ ధరలను కేంద్రమే నియంత్రిస్తున్నట్లు తెలిపాయి. కేంద్రం జారీ చేసే ధరల నియంత్రణ ఉత్తర్వులపై తాము ఆధారపడుతున్నట్లు ధర్మాసనానికి తెలియజేశాయి.