- మహా కుంభమేళా ముగింపు దశలో అద్భుతం
- రాత్రి సమయంలో కనిపిస్తున్న 7 గ్రహాలు
- ఫిబ్రవరి 28తో గరిష్ఠ స్థాయికి వీక్షణ
- ఆ తర్వాత క్రమంగా కనుమరుగు
Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటున్న వేళ వినీలాకాశంలో అరుదైన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతమవుతోంది. సౌర వ్యవస్థలోని మొత్తం ఏడు గ్రహాలు రాత్రివేళ భారత్ నుంచి కనిపిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, నెప్ట్యూన్ గ్రహాలు కనబడుతున్నాయి. వీటిలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను ఎలాంటి పరికరాల సాయం లేకుండానే వీక్షించవచ్చు. అయితే, వరుణుడు, నెప్ట్యూన్ గ్రహాలను చూడాలంటే బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ గ్రహాలన్నీ సూర్యుడికి ఒకవైపునే ఉండే ఈ ఖగోళ ప్రక్రియ గత నెల జనవరిలోనే ఆరంభమైంది. ఫిబ్రవరి 28న గరిష్ఠస్థాయి వీక్షణ ఉంటుంది. గ్రహాల కక్ష్యలన్నీ సూర్యుడికి ఒకవైపునే ఉండడంతో ఇది సాధ్యమవుతోంది. ఫిబ్రవరి 28 తర్వాత గ్రహాలు క్రమక్రమంగా కనుమరుగవనున్నాయి. సంధ్యాకాలం, అంటే పొద్దుపోయే ముందు ఈ గ్రహాలను చూడడానికి అనువైన సమయమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా తిరిగి ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతం కానుందని చెబుతున్నారు. ఆ సమయంలో వేకువజామున ఆరు గ్రహాలను భారత్ నుంచి వీక్షించవచ్చని అంటున్నారు.
మహాకుంభమేళా ముగింపు సమయంలో గ్రహాలు ఈ విధంగా ప్రత్యేకంగా అమరి ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. విశ్వంలో చోటుచేసుకునే ఘట్టాలు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని భక్తులు విశ్వసిస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆధ్యాత్మిక భావం పక్కనపెడితే పండుగల సమయాలు ఖగోళ దృగ్విషయాలతో ముడిపడి ఉన్నాయి. కాగా, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్‌లలో ప్రతి నాలుగేళ్లకోసారి, ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 ఏళ్లకోసారి భక్తులు పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న విషయం తెలిసిందే.