Encounter: ఛత్తీస్‌గడ్ అడవుల్లో మరోసారి తూటా పేలింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం, ఘటనా స్థలిలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. తాజాగా ఈ మృతుల సంఖ్య 8కి చేరింది. మరింత పెరిగే అవకాశాలూ ఉన్నట్టు తెలుస్తున్నది. ఏకే 47 రైఫిల్, భారీగా మందుగుండ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ దండకారణ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర సరిహద్దు అబూజ్‌మడ్ దండకారణ్యంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు ఈ నెల 29న కూంబింగ్ ప్రారంభించారు. మరుసటి రోజే అబూజ్‌మడ్ సమీపంలోని టేక్ మెటా-కాకూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు బృందానికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఉదయం ఆరు గంటల ప్రాంతంలోనే ఉభయ వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ తర్వాత స్పాట్‌ను పరిశీలించగా ఇద్దరు మహిళా మావోయిస్టులు, మావోయిస్టు క్యాడర్‌ల మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read: రుణమాఫీ బలంగా తీసుకెళదాం
అదే విధంగా స్పాట్‌లో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక ఏకే 47 రైఫిల్ కూడా ఉన్నది. ఆయుధాలతోపాటు రోజువారీగా వినియోగించే వస్తువులనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత సమగ్ర సమాచారం విడుదల కానుంది.