Ministry for Non-Existent Department: పంజాబ్ లో ప్రభుత్వంలో గమ్మత్తు జరిగింది. అసలే ఉనికే లేని ఓ శాఖకు (Non Existent Department) ఒకాయన మంత్రిగా (Minister) ఉన్నారు. 20 నెలలుగా సాగిన ఈ వ్యవహారాన్ని ఇప్పుడు సర్కారు (Punjab Govt) గుర్తించి సదరు శాఖ ఏదీ లేదని ప్రకటించింది. బహుశా… ఇలాంటి విచిత్రం ఏ రాష్ట్ర సర్కారులోను జరిగి ఉండదు. ఈ విషయంపై అక్కడ అధికారంలో ఉన్న ఆప్ (AAP) ప్రభుత్వం పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
విషయం ఏంటంటే… 2022 మార్చిలో భగవంత్ మాన్ (Bhagwant Mann) నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి వర్గంలో బాగంగా 2023లో కుల్దిప్ సింగ్ ధలివాల్ కు (Kuldeep Singh Dhaliwal) సర్కారు రెండు శాఖలు కేటాయించింది. అందులో ఒకటి ఎన్ఆర్ఐ వ్యవహారాలు కాగా మరొకటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్ మెంట్ (Administrative Reforms Department) మరొకటి. గత ఏడాది కేబినెట్ ను పునర్వ్యవస్థికరించారు కూడా. అప్పుడు కూడా గమనించలేదు. తాజాగా ఇన్ని నెలల తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనే డిపార్ట్మెంటే లేదని గుర్తించిన మాన్ సర్కారు… గతంలో జారీ చేసిన జీవో ను సవరించింది. అలాంటి శాఖ లేనట్లుగా పేర్కొంది.
ఇక ఈ పరిణామాలపై చీపురు పార్టీని కమలం పార్టీ ఆడుకుంటోంది. పాలన అంటే ఆప్ నకు జోక్ అయిపోయిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉనికిలో లేని శాఖకు దాదాపు రెండు సంవత్సరాలుగా కుల్దిప్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండటం, ఆ సంగతి సీఎం కూడా తెలియకపోవడం చూస్తుంటే… పంజాబ్ లో పాలన పరిస్థితి ఎలా ఉందో ఊహించొచ్చు అని హేళన చేస్తున్నారు.
కాగా, ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించిన రీతిలో షాక్ తగిలింది. ఆ పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. ఆయనతో పాటు కీలక నాయకులైన మనీశ్ సిపోడియా, సత్యేంద్ర జైన్ లాంటి వాళ్లు కూడా ఓటమి పాలయ్యారు. 27 ఏళ్లుగా విజయం కోసం పరితపిస్తున్న బీజేపీ హస్తిన పీఠంపై పతాకాన్ని ఎగురవేసింది.
ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల కేజ్రీవాల్ పై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. లిక్కర్ స్కాం, అవినీతి ఆరోపణలే పార్టీ చిత్తవడానికి కారణమయ్యాయని జాతీయ మీడియా పేర్కొంది. ఇదిలా వుంటే… కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి అవుతారని వార్తలు వినిపించాయి. అయితే అందులో వాస్తవం లేదని ఇటీవలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మానే వెల్లడించారు.