Pune Incident: మహారాష్ట్రలోని పుణే(Pune) లో ఆగి ఉన్న బస్సులో ఓ యువతి పై అత్యాచారానికి (Rape) పాల్పడి పరారైన నిందితుడు రాందాస్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన దాదాపు 75 గంటల అనంతరం నిందితుడు (Accused) పోలీసులకు చిక్కాడు. శ్రీరూర్ లో ఓ చెరకు తోట(Sugar Cane field) లో నక్కిన అతన్ని పట్టుకున్నారు.
శ్రీరూర్ లో ఉన్న ఓ చెరుకు తోటలో రాందాస్ (Ramdas Dattatreya) దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్లు, జాగిలాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అంతకుముందే నిందితుడి ఫోటోను విడుదల చేసినా పోలీసులు… ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష నజరానా ఇస్తామని ప్రకటించారు. అయితే గురువారం అర్ధరాత్రి నిందితుడు తీవ్ర ఆకలితో ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి అతన్ని గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని రాందాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పుణేలో అత్యంత రద్దీగా ఉండే స్వర్గేట్ బస్ స్టేషన్ (Swargate Bus station) వద్ద మంగళవారం ఈ అత్యాచార ఘటన జరిగింది. బస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో పోలీస్ స్టేషన్ ఉంది. మంగళవారం తెల్లవారుజామున స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద బాధితురాలు బస్ కోసం ఎదురుచూస్తుండగా, అక్కడే ఉన్న రాందాస్ ఆమెతో మాట కలిపి వివరాలు అడిగాడు. ఆమె గ్రామానికి వెళ్లవలసిన బస్సు వివరాలు చెప్పగా, అదీ పక్కనే ఆగి ఉందని చెప్పి ఖాళీగా ఉన్న బస్సు వద్దకు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన మహిళకు, ప్రయాణికులు నిద్రపోతున్నారని అందుకే లైట్లు వెయ్యలేదని నమ్మబలికాడు. ఆమె బస్సు లోపలికి వెళ్లగానే డోర్ మూసేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. నిరసలను వ్యక్తమయ్యాయి.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పోలీసులు గుర్తించారు. అతడిపై అంతకు ముందు కేసులున్నాయని, 2019 నుంచి బెయిల్ మీద ఉన్నాడని తెలిపారు. అతన్ని పట్టుకునేందుకు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.