Independence Day: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోవత్స వేడుకలు (79th independence day 2025) ఘనంగా జరిగాయి. విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా జెండా వందనం కార్యక్రమాలు సంబరంగా జరిగాయి. అయితే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద జరిగిన భారత్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఖలిస్థానీ అనుకూల వ్యక్తులు అడ్డుతగిలారు. వేడుకలను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారతీయులు శాంతియుతంగా కాన్సులేట్ కార్యాలయం ముందు గుమిగూడ ఉండగా.. ఖలిస్థానీ వ్యక్తుల సమూహం ఖలిస్థానీ జెండాలు పట్టుకొని అక్కడికి వచ్చి నిరసన, భారత వ్యతిరేక నినాదాలు చేశాయి. ముఖం కనిపించకుండా వారంతా వస్త్రాలను కప్పుకున్నారు.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న కొంతమంది ‘గూండాలు’ భారత స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని భంగపరిచే ప్రయత్నం చేశారని ‘ది ఆస్ట్రేలియా టుడే’ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ఖలీస్థాన్ సానుకూల వ్యక్తులు బిగ్గరగా నినాదాలు చేయగా… భారతీయులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ప్రతిస్పందించారు. ఆ కొద్దిసేపటికే ఆస్ట్రేలియా పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా అధికారులు నియంత్రించారు. దీంతో, భారతీయులు ప్రశాంతంగా భారత జాతీయ పతాకాన్ని కాన్సులేట్ వద్ద ఆవిష్కరించారు. ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ వంటి నినాదాలు చేశారు.
Read Also- Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా ఎంపికపై అప్‌డేట్.. కెప్టెన్ ఎవరంటే?
ఆస్ట్రేలియాలో ప్రో-ఖలిస్థానీల హింస
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆటంకం కలిగించిన ప్రో-ఖలిస్థాన్ వ్యక్తులు ఆస్ట్రేలియాలో ఆగడాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. అయితే, అవి మరింత పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని విద్వేష నేరాలకు పాల్పడుతున్నారు. గత నెలలో, ఆస్ట్రేలియాలోని బొరోనియాలో ఉన్న స్వామినారాయణ దేవాలయాన్ని ఖలిస్థానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. దేవాలయం గోడపై విద్వేషపూరిత రాతలు రాశారు. దేవాలయానికి సమీపంలోనే ఉన్న రెస్టారెంట్లపై కూడా ఈ విధమైన నినాదాలను గోడలపై రాశారు. ఈ రెస్టారెంట్లను ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు అడిలైడ్‌లో 23ఏళ్ల వయసున్న భారత సంతతి వ్యక్తితో పార్కింగ్ విషయంలో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు.
Read Also- Independence day celebrations: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఈ తరహా విధ్వేష ఘటనలు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు.. ఖలిస్థాన్ అనుకూలవాదులను ప్రోత్సహించొద్దంటూ కేంద్ర ప్రభుత్వం పదేపదే కోరుతోంది. అలాంటివారికి చోటు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ఈ తరహా తీవ్రవాద, విభజన వాద భావజాలాలు మాకు, మీకు మంచిది కాదు. ద్వైపాక్షిక సంబంధాలకు కూడా మంచిది కాదు’’ అని భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ గతంలో ఓ సందర్భంలో స్పష్టం చేశారు.