– రెపోరేటుపై కీలక నిర్ణయం
– ఎనిమిదోసారి కూడా మార్చని ఆర్బీఐ
– ఆహార ద్రవ్యోల్బణంపై మాత్రం ఆందోళన
Post Monetary Policy Press Briefing By RBI Governor Repo Rate Unchanged: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా జరగడం వరుసగా ఎనిమిదోసారి. వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని, రెపో రేటు 6.5 శాతంగానే స్థిరంగా కొనసాగనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ద్రవ్య పరపతి కమిటీ వివరాలను ఆయన వెల్లడిస్తూ, ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న కారణంగానే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని అన్నారు. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉన్నదని, అయినప్పటికీ భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన పునాదులతో ఉందని, ఇలాంటి అస్థిర వాతావరణంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ దాస్ పేర్కొన్నారు. రెపో రేటును 6.5 శాతం వద్దే ఉంచామన్నారు. ఇంధన ధరల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతోందని తెలిపారు. అయినప్పటికీ ధరల పెరుగుదలపై ఎంపీసీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంతవరకు ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
గతంలో 2023లో చివరిసారి రెపో రేటును మార్చారు. రెపో రేటును యథాతథంగా ఉంచేందుకు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో నలుగురు అనుకూలంగా ఉన్నారు. దీనిపై గవర్నర్ మాట్లాడుతూ, ‘‘ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపు తీసుకురావడానికి ఆర్‌బీఐ కట్టుబడి ఉంది. నైరుతి రుతుపవనాలతో ఖరీఫ్ సాగు ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరుగుతాయనుకుంటున్నారు. 2024,2025 వృద్ధిరేటు అంచనా 7.5 శాతం. ఇది కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగో ఏడాది 7 శాతం ఎగువన వృద్ధి నమోదైనట్లు అవుతుంది’’ అని తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు. ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని పొందుతున్న అతిపెద్ద దేశంగా కొనసాగుతోందని వివరించారు. ఎఫ్‌డీఐలు బలంగా కొనసాగుతున్నాయి. నికరంగా చూస్తే మాత్రం తగ్గుదల నమోదైంది. వస్తు సేవల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఫెమా నిబంధనలను హేతుబద్ధీకరించాలని సూచించారు.