Survey on Modi: ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. మూడో దఫా ప్రధానిగా వ్యవహరిస్తున్న మోదీ పాలనపై ‘ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood of Nation Survey) నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. మోదీ పనితీరు రేటింగ్ కొంతమేర తగ్గింది. 2025 ఫిబ్రవరిలో మోదీ పని తీరును 62 శాతం మంది బావుందని చెప్పగా, ఆగస్టు నెల నాటికి ఆ సంఖ్య 58 శాతానికి తగ్గిపోయిందని సర్వే (Survey on Modi) పేర్కొంది. తాజా సర్వేలో మోదీ ఆదరణ కాస్త తగ్గినట్టుగా అనిపిస్తున్నా, ప్రధానిగా పదకొండేళ్ల తర్వాత కూడా ప్రజల్లో ఆయనకు విశేష మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించింది.
Read Also- Telangana BJP: తెలంగాణ బీజేపీలో కమిటీల కొర్రీ!
జనాల అభిప్రాయం ఇదే..
ప్రధాని మోదీ మూడో దఫా పనితీరు అద్భుతంగా ఉందని 34.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ పాలనలో అద్భుతంగా ఉందని 36.1 ఉండగా, ఇప్పుడది కొద్దిగా తగ్గింది. ఇక మోదీ పాలన బావుందని 23.8 శాతం మంది సమాధానం ఇచ్చారు. యావరేజ్‌గా ఉందని 12.7 శాతం మంది భావించగా, 12.6 శాతం మంది చెత్తగా ఉందని, మరో 13.8 శాతం మంది పరమ చెత్తగా ఉందని అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మొత్తంగా చూస్తే, మోదీపై జనాలకు ఇంకా విశ్వాసం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ప్రజల్లో కొంతమేర అసంతృప్తి పెరిగిందని స్పష్టం చేసింది.
ఎన్డీయే పాలనపై ఏమంటున్నారంటే..
ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై కూడా జనాల్లో స్వల్పంగా అసంతృప్తి పెరిగింది. ఫిబ్రవరిలో 62.1 శాతం మంది ఎన్డీయే ప్రభుత్వ పనితీరు మంచిగా ఉందని చెప్పగా, తాజా సర్వేలో 52.4 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. 15.3% మంది ఎన్డీయే పాలన అసంతృప్తికరంగా ఉందని చెప్పారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఈ సంఖ్య 8.6 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు దాదాపు రెట్టింపు అవ్వడం గమనార్హం. కాగా, ఇండియా టుడే ఈ సర్వేను జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య కాలంలో నిర్వహించింది. సర్వే కోసం మొత్తం 54,788 మంది కొత్తవారిని ప్రశ్నించారు. అదనంగా 1,52,038 మంది అభిప్రాయాలను రెగ్యులర్ ట్రాకర్ డేటా ద్వారా సేకరించారు. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను బేస్‌గా తీసుకుని ఈ సర్వే రిపోర్టును రూపొందించారు.