Modi Manipur Visits: కుకీ-మైతేయ్ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రమంతా అట్టుడికిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తొలిసారి మణిపూర్ రాష్ట్రంలో (Modi Manipur Visits) పర్యటించారు. భయోత్పాతంతో ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చురాచాంపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ, మణిపూర్ రాష్ట్ర వాసులకు కీలక సందేశం ఇచ్చారు. సరికొత్త ఉదయం మణిపూర్ తలుపుతడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన బాధితుల్లో నూతన ఆశలు చిగురిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘‘మణిపూర్ రాష్ట్రం ఆశలు, ఆకాంక్షలకు నిలయమైన నేల. అయితే, దురదృష్టవశాత్తూ ఈ ప్రాంత అందాలను అల్లర్ల అంధకారం కప్పివేసింది. కొద్ది సేపటి క్రితం నేను శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను కలిశాను. విశ్వాసం, ఆశలు మణిపూర్‌లో ఉదయిస్తున్నాయని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
Read Also- Dog Name Controversy: పెంపుడు కుక్కకు.. పక్కింటోడి పేరు పెట్టిన యజమాని.. ఇంకేముంది రచ్చ రచ్చే!
మణిపూర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ఇక్కడి ప్రజల జీవితం తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ఆయన భరోసా ఇచ్చారు.
అభివృద్ధికి శాంతి ముఖ్యం
ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మొదట శాంతి అవసరమని, మణిపూర్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకుని అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో ఈశాన్య భారతంలో అనేక వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇది ఎంతో సంతృప్తికరమైన విషయమని చెప్పారు. ‘‘ఇటీవల కొండ ప్రాంతాల్లో, లోయల్లో వివిధ సమూహాలతో చర్చలు జరగడం, ఒప్పందాలు కుదరడం సంతోషకరం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాల్లో భాగమే. సంప్రదింపులు, పరస్పర గౌరవం, అవగాహనకు ప్రాధాన్యం ఇస్తూ శాంతిని నెలకొల్పే కృషి చేస్తున్నాం. నా విజ్ఞప్తి ఏమిటంటే, అన్ని సంస్థలు, సమూహాలు శాంతి మార్గంలో ముందుకు సాగాలి. కలలు నిజం చేసుకోవాలని కోరుతున్నాను. నేను మీకు అండగా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం మణిపూర్ ప్రజలతో ఉంది’’ ప్రధాని మోదీ అభ్యర్థించారు.
మణిపూర్‌పై వరాల జల్లు
ప్రధాని మోదీ మణిపూర్‌కు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించారు. ఇంపాల్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని, కొత్త రహదారులు, జాతీయ రహదారుల విస్తరణ చేపడతామని ప్రకటించారు. జిరీబామ్ నుంచి ఇంపాల్ వరకు రైలు ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని, రోడ్-రైల్ కనెక్టివిటీని పెంచుతామని మోదీ తెలిపారు. పేదల కోసం దేశవ్యాప్తంగా పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రకటన చేశామని, మణిపూర్ కూడా ప్రయోజనం పొందుతుందని చెప్పారు. ఇప్పటికే మణిపూర్‌లో సుమారుగా 60,000 ఇళ్లు నిర్మించామని, వేలాది కుటుంబాలు గౌరవంతో, భద్రతతో జీవించే అవకాశం పొందాయని ఆయన ప్రస్తావించారు. భారతదేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారబోతోందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ ప్రాంతాలకు రావడానికి దశాబ్దాలపాటు పట్టేవని, కానీ ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రం మిగతా దేశంతో కలిసి అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది’’ అని మోదీ చెప్పారు.
కాగా, 2023 మే నెలలో మణిపూర్‌లో మైతేయ్ (Meitei), కుకీ (Kuki) తెగల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసలో ఏకంగా 250 మందికిపైగా మృతి చెందారు. భూమి హక్కులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయమై ఈ రెండు వర్గాల మధ్య హింస చోటుచేసుకుంది. అల్లర్లు మొదలైన సమయంలో మణిపూర్‌లో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం, సుమారుగా 60,000 మంది తమ ఇళ్లను వదిలి శరణార్థ శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇళ్లు లేని బాధితులు చాలామంది ఇప్పటికీ శరణార్థి శిబిరాల నుంచి తిరిగి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు సంపూర్ణంగా శాంతించకపోవడం కూడా ఇందుకు కారణంగా ఉంది.
Read Also- Crime News: పట్టపగలే శంకర్ పల్లిలో దారి దోపిడీ.. మధ్యలో కారు ప్రమాదం.. చివరికి..?