- మత విశ్వాసాలను అపహాస్యం చేస్తున్నారు
- మత వారసత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం
- సమాజంలో విభజనే వీరి అజెండా
- మహా కుంభమేళాపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలపై ప్రధాని మోదీ కౌంటర్ ఎటాక్
PM Modi: ప్రయాగ్‌రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాపై పలు విపక్ష పార్టీల నేతలు సంధిస్తున్న విమర్శనాస్త్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. బానిస మసస్తత్వం ఉన్నవారే మత విశ్వాసాలు, సాంస్కృతిక, సంప్రదాయాలను అవహేళన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తులు భారతదేశ మత వారసత్వాన్ని అణగదొక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
మత సాంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘‘ మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకుల సమూహం మతాన్ని అపహాస్యం, అవహేళన చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. ఈ వ్యక్తులకు విదేశీ శక్తులు కూడా అనేక సార్లు మద్దతు అందించాయి. తద్వారా భారతదేశాన్ని, ఈ దేశ మతాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. హిందూమత విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు ఏదో ఒక దశలో లేదా శతాబ్దాల్లో చూస్తూనే వస్తున్నాం” అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఆలయాలు, సాంప్రదాయాలు, పండుగలపై విమర్శలు చేసేవారిపై కూడా మోదీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సమాజంలో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడమే వారి ప్రధాన అజెండా అని ఆయన విరుచుకుపడ్డారు. అనాదికాలంగా ప్రకృతితో ముడిపడిన మతం, సంస్కృతిపై నిస్సిగ్గుగా దాడి చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, బాగేశ్వర్ దామ్ ఆధ్యాత్మిక గురువు ధిరేంద్ర శాస్తిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మత సామరస్యానికి కృషి చేస్తున్నారని, మత సంబంధ ప్రాంగణంలో అత్యంత కీలకమైన క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారని మెచ్చుకున్నారు.
మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట, త్రివేణి సంగమంలో నీరు కలుషితం అయ్యిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మరీ ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, మహా కుంభమేళాను ‘మృత్యు కుంభ్’గా మార్చారంటూ అసెంబ్లీలో ప్రకటించారు. తొక్కిసలాట ఘటనను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కూడా మహా కుంభమేళాలో సామాన్యులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ విమర్శించారు. కుంభమేళా వ్యయాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.