Plane Tragedy: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) ఇప్పటివరకు 274 మందిని బలిగొంది. 242 మందిలో 241 మంది విమాన ప్యాసింజర్లు, జేబీ మెడికల్ కాలేజీ హాస్టల్‌కు చెందిన 33 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న మృతుల విషాదగాథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ప్రమాదానికి గురైన విమానంలో ఓ ఆటో డ్రైవర్ కూతురు ప్రయాణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి యూకే వెళుతోందని ఆ తండ్రి తెగ మురిసిపోయాడు. ఉన్నత చదువులు చదువుకుంటే తల రాతలు మారిపోతాయని కుటుంబమంతా సంతోషపడింది. గురువారం ఉదయం పట్టరాని ఆనందంతో, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి సెండాఫ్ ఇచ్చారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే, అవే వారికి చివరిచూపులు అని వారికి తెలియదు.
ఉన్నత చదువు ఆశలు గల్లంతు
ఎయిరిండియా విమాన ప్రమాదంలో పాయల్ ఖతిక్ (Payal Khatik) అనే యువతి మృతి చెందింది. గుజరాత్‌లోని హిమత్‌నగర్‌కు చెందిన ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ లోడింగ్ ఆటోను నడుపుతున్నారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఖాతిక్ యూకే బయలుదేరింది. తొలిసారి తన కూతురు విదేశాలకు వెళుతుండడం, తమ కుటుంబంలో విమానం ఎక్కబోతున్న తొలి వ్యక్తి కావడంతో వారు చాలా మురిసిపోయారు. గురువారం ఉదయం తల్లిదండ్రులతో పాటు చెల్లె ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీడ్కోలు పలికేందుకు తల్లిదండ్రులు వెంట రావడంతో పాయల్ ఉత్సాహంగా విమానం ఎక్కింది. కూతురికి వీడ్కోలు పలికి వారు ఇంటికి వెళ్లారు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన పాయల్, విమానం బయలుదేరిన 5 నిమిషాల్లోనే కానరాని లోకాలకు చేరింది. పాయల్ ఖాతిక్ చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. డీఎన్ఏ టెస్టులో కూడా ధ్రువీకరణ జరిగింది.
Read this- Plane Crash: ‘11ఏ’ సీటు మిస్టరీ.. 27 ఏళ్లక్రితం ‘సేమ్ మిరాకిల్’
చదువు కోసం లోన్ తీసుకుంది
పాయల్ ఖాతిక్ మృతిపై ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ చదువు పూర్తయ్యాక పాయల్ ఇంటి వద్దే ఉందని, లండన్‌లో ఉన్నత చదువులు చదవాలని భావించిందని, అందుకోసం స్టడీ లోన్ కూడా తీసుకుందని ఆయన తెలిపారు. ఉద్యోగం చేసి లోన్ చెల్లించవచ్చని అనుకుందని సురేష్ కన్నీటి పర్యంతమయ్యాయి. కుటుంబానికి సాయం చేయాలని ఎన్నో కలలు కన్నదని, పేదరికం బయటపడేస్తానని చెబుతుండేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఇప్పుడు లోన్ చెల్లించే మార్గమే లేదని ఆయన వాపోయారు.
Read this- OP Rising Lion: ఇరాన్ అణు ప్లాన్ మటాష్.. ఇజ్రాయెల్ దాడి ఇప్పుడే ఎందుకు?
‘‘మా ఫ్యామిలీలో విదేశాలకు వెళ్లాలనుకున్న తొలి వ్యక్తి నా కూతురే. ఆమె లండన్ వెళ్లాలనుకుంది. ఉదయపూర్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం వెళుతుండగా ఈ విషాదం జరిగింది. మా కుటుంబం చాలా విషాదంలో ఉంది’’ అని పేర్కొన్నారు. మృతురాలు పాయల్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో బీటెక్ చదవిందని, చాలా మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుందని భరత్ చౌహాన్ అనే బంధువు చెప్పారు. హిమత్‌నగర్‌లోని ఆదర్శ్ స్కూల్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుందని, హిమత్ హై స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిందని వివరించారు. పాయల్‌కు అన్నదమ్ముళ్లు, సోదరీమణులు ఉన్నారని, తండ్రి డ్రైవర్ అని పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అంతలోనే ఇంత విషాదం జరిగిపోయిందని పేర్కొన్నారు. పాయల్ ఖాతిక్ ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి కుటుంబానికి అండగా నిలిచేదని మరో వ్యక్తి చెప్పారు. ఉన్నత చదువులు చదవాలనే ఆమె ఆశలు అడియాసలు అయ్యాయని వివరించారు.