Waqf Board Amendment Bill: ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వక్ఫ్ చట్టసవరణ బిల్లు-2025కు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మైనారిటీ శాఖ మంత్రి కిరన్ రిజిజు గురువారం పెద్దల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 95 ఓట్లు పడినట్టు చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
అధికార, విపక్షాల మాటల తూటాలు
బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, మైనారిటీ హక్కులు లాక్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బిల్లు రూపంలో ఘర్షణ అనే విత్తనాలను నాటుతున్నారని ఆక్షేపించారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే బిల్లు ఇదని,, ఇలాంటి బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘1995 వక్ఫ్ చట్టాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించారు. అదే వ్యక్తులు ఇప్పుడు ఆ చట్టం లోపభూయిష్టంగా ఉందని చెబుతున్నారు.
పేదలు, మైనారిటీల కోసం కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని చెబుతున్నారు. నిజానికి, ప్రజలకు హాని కలిగించే నిబంధనలు తప్ప కొత్తగా బిల్లులో చేర్చించి ఏమీ లేదు’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడుతూ, వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి అని అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు సమాజాన్ని బీజేపీ శాశ్వతంగా విభజించేందుకే ప్రయత్నిస్తోంది. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేసింది.
Also read: SC on Kancha Gachibowli: హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. పనులపై స్టే విధింపు
నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం లేదా ఎన్నికల నిర్వహణ ఇలా అన్ని అంశాల్లోనూ దేశాన్ని అగాథంలోకి నెట్టివేస్తోంది. రాజ్యాంగం కేవలం పేపర్లకే పరిమితమైంది. సభల్లో ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వడం లేదు’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలువురు మంత్రులు కౌంటర్లు ఇచ్చారు.
ఇరాక్ లాంటి ముస్లిం దేశాలు కూడా వక్ఫ్ చట్టాలను సవరించాయని, మరి భారతదేశంలో ఎందుకు సవరించకూడదని ప్రశ్నించారు. మరోవైపు, నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ పార్టీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఓటింగ్‌కు సంబంధించి ఎంపీలకు విప్ జారీ చేయలేదు. ఎంపీలు తమ అంతరాత్మానుసారం ఓటు వేయవచ్చని పట్నాయక్ అన్నారు. ఏపీలో విపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ కూడా ఎంపీలకు విప్ జారీ చేయలేదంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.