Om Birla as speaker
జాతీయం

National News:లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా

– 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక
– ప్రతిపాదించిన ప్రధాని మోదీ
– మూజువాణి విధానంలో జరిగిన ఓటింగ్
– ఓం బిర్లా విజేతగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్‌
– అభినందనలు తెలిపిన మోదీ, రాహుల్, సభ్యులు
– వరుసగా రెండు సార్లు స్పీకర్ పదవిని చేపట్టిన 5వ వ్యక్తిగా ఓం బిర్లా

Om Birla elected as Speaker of 18th Lok Sabha second time: లోక్ సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎట్టకేలకు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కె సురేష్‌తో పోటీపడి గెలుపొందారు. 17వ లోక్ సభ స్పీకర్‌గా కూడా ఓం బిర్లా చేశారు. అప్పట్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సారి కూడా ఓం బిర్లానే 18వ లోక్ సభ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టింది ఎన్డీఏ. ఈ పదవిపై అధికార, విపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమయింది. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. అటు కాంగ్రెస్ కూటమి తరపున కె సురేష్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించారు. దీనిని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు.

మూజువాణి ఓటింగ్

మూజువాణి విధానంలో ఓటింగ్‌ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెంట రాగా, ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్‌ సహా లోక్‌ సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు. స్పీకర్‌ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా నిలిచారు ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎంఏ అయ్యంగార్, జీఎస్‌ థిల్లాన్, బలరాం ఝాఖర్, జీఎంసీ బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖర్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌ సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌ అయ్యారు.

ఓం బిర్లా గురించి

ఓం బిర్లా 1962 నవంబర్ 23న కోటాలో జన్మించారు. ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1991లో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా 1997లో నియమితులయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తొలిసారిగా 2003లో కోటా సౌత్ స్థానం నుంచి గెలిచి రాజస్థాన్ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని కోటా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ గుంజాల్‌పై 41 వేల ఆధిక్యంతో గెలుపొందారు. గడిచిన 20 ఏళ్లలో లోక్ సభకు మరోసారి ఎన్నికైన నేతగా బిర్లా నిలిచారు. 2014 నుంచి కోటా లోక్ సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. 2019లో లోక్‌ సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి స్పీకర్ పీఠాన్ని దక్కించుకున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!